Indian Football: ఏఐఎఫ్ఎఫ్ సస్పెన్షన్… సుప్రీం కీలక ఆదేశాలు
ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై ఫిఫా నిషేధం విధించడంతో భారత ఫుట్ బాల్ ప్రమాదంలో పడింది.
- Author : Naresh Kumar
Date : 17-08-2022 - 2:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై ఫిఫా నిషేధం విధించడంతో భారత ఫుట్ బాల్ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఇటు క్రీడాశాఖ, అటు సుప్రీంకోర్టు సన్నద్ధమయ్యాయి. ఏఐఎఫ్ఎఫ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేలా చూడాలని తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది.
ఈ కేసుపై బుధవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర క్రీడాశాఖకు కీలక ఆదేశాలిచ్చింది. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అండర్ 17 మహిళల ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. అయితే కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపించారు. ఫిఫాతో చర్చలు జరుపుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ అంశాన్ని ఆగస్టు 22న విచారించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా ఏఐఎఫ్ఎఫ్ పై ఫిఫా నిర్ణయం తీవ్ర కలకలం రేపింది. ఏఐఎఫ్ఎఫ్ లో బయటి వ్యక్తుల ప్రమేయం పెరిగిపోయిందనే కారణంగా ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిఫా తాజా నిర్ణయం భారత ఫుట్‌బాల్ కు భారీ ఎదురుదెబ్బగా చెప్పాలి. భారత పురుషుల, మహిళల జట్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు వీళ్లేదు. అలాగే భారత్ వేదికగా జరగాల్సి ఉన్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం ఈ వివాదం పరిష్కరించేందుకు క్రీడాశాఖ ప్రయత్నిస్తోంది.