IPL 2022 Auction : ఎవరీ టిమ్ డేవిడ్ ?
ఐపీఎల్ వేలంలో రెండోరోజు పలువురు స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసినా..
- By Naresh Kumar Published Date - 08:50 PM, Sun - 13 February 22

ఐపీఎల్ వేలంలో రెండోరోజు పలువురు స్టార్ ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిసినా.. అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం టిమ్ డేవిడ్. సింగపూర్‌లో పుట్టి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసముంటున్న టిమ్ డేవిడ్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. మిడిలార్డర్ నుండి ఫినిషర్ వరకూ అద్భుతమైన బ్యాటింగ్ చేయగల సత్తా కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అందుకే వేలంలో ఫ్రాంచైజీలు అతని కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. కనీస ధర 40 లక్షలతో వేలంలోకి అడుగుపెట్టిన టిమ్ డేవిడ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా, లక్నో , రాజస్థాన్ గట్టిహానే ప్రయత్నించాయి. చివర్లో రేసులోకి వచ్చిన ముంబై ఇండియన్స్ అత్యధిక బిడ్ చేసి రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. టిమ్ డేవిడ్‌ను గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. యుఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్ కోసం ఫిన్ అలెన్‌కు రీప్లేస్‌మెంట్‌గా టిమ్‌ను తీసుకుంది. అయితే ఈ సీజన్‌లో ఒకే మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయినప్పటకీ ప్రస్తుత వేలంలో రికార్డ్ ధర పలకాడు. ఆస్ట్రేలియా నుండే వేలంలో తన పేరు నమోదు చేసుకున్న టిమ్ డేవిడ్ ఇప్పటి వరకూ సింగపూర్ తరపునే అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ ఆడాడు. 14 మ్యాచ్‌లలో 46.50 అద్భుతమైన సగటుతో 558 పరుగులు చేశాడు. 158.5 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన టిమ్ పేరిట 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సింగపూర్ క్రికెట్ జట్టు కావడంతో ఎవరికీ అంతగా అతని గురించి తెలియలేదు. అయితే విదేశీ టీ ట్వంటీ లీగ్స్‌తో టిమ్ డేవిడ్ సత్తా అందరికీ తెలిసింది. బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్‌లలో అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటర్‌గా , పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్నాడు. అక్కడ అతను 6 ఇన్నింగ్స్‌లలో 65.6 సగటుతో, 207 స్ట్రైక్ రేట్‌తో 197 పరుగులు చేశాడు. భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్టగా పేరున్న టిమ్ డేవిడ్ రికార్డులను దృష్టిలో ఉంచుకునే వేలంలో ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచాయి. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున టిమ్ అరంగేట్రం ఖాయమైనట్టే. ఇప్పటికే పలువురు హిట్టర్లు ఉన్న ముంబైకి టిమ్ డేవిడ్ రాకతో మరో ఫినిషర్ దొరికాడని విశ్లేషకులు చెబుతున్నారు.