ICC Test Rankings : నంబర్ వన్ ఆల్ రౌండర్ గా జడేజా
ఐసీసీ టెస్ట్ రాంకింగ్స్ లో భారత్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దుమ్మురేపాడు.
- By Naresh Kumar Published Date - 04:36 PM, Wed - 9 March 22

ఐసీసీ టెస్ట్ రాంకింగ్స్ లో భారత్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దుమ్మురేపాడు. తాజాగా ప్రకటించిన ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మొహాలీ టెస్టులో అద్భుత సెంచరీ చేసిన జడేజా ఆ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన జడేజా వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్ కు ముందు మూడో స్థానంలో ఉన్న జడ్డూ బ్యాట్ తో పాటు బంతి తొనూ రాణించడంతో రెండు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్ లో నిలిచాడు. అటు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కూడా రవీంద్ర జడేజా అద్భుతంగా దూసుకెళ్లాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో జడేజా 17 స్థానాలు ఎగబాకి 37వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్‌లో 3 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే మరో క్రికెటర్ అశ్విన్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ విభాగంలో మాత్రం అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. ర్యాంకింగ్స్ లో భారత తరపున కోహ్లీ దే బెస్ట్ ప్లేస్. గతంలో ఏడో స్థానంలో ఉన్న కోహ్లీ.. ప్రస్తుతం రెండు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు. కాగా వికెట్ కీపర్ రిశబ్ పంత్ ఒక స్థానం మెరుగై పదో స్థానంలో నిలిచాడు.శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి 45 పరుగులు చేయగా.. రోహిత్ 29, పంత్ 96 పరుగులు సాధించారు.