Harry Brook: సెంచరీతో విమర్శకులకు జవాబిచ్చిన బ్రూక్
ఎందుకు కొన్నారో...రూ.13.25 కోట్లు దండగ.. ఇదేం బ్యాటింగ్.. పోయి టెస్టులకు ఆడుకో... ఇదీ ఆ యువ బ్యాటర్ పై వచ్చిన విమర్శలు.. కట్ చేస్తే ఈ విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు.
- By Hashtag U Published Date - 11:26 PM, Fri - 14 April 23

Harry Brook: ఎందుకు కొన్నారో…రూ.13.25 కోట్లు దండగ.. ఇదేం బ్యాటింగ్.. పోయి టెస్టులకు ఆడుకో… ఇదీ ఆ యువ బ్యాటర్ పై వచ్చిన విమర్శలు.. కట్ చేస్తే ఈ విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానమిచ్చాడు. ఏదో హాఫ్ సెంచరీ కాదు ఏకంగా సెంచరీ ఇన్నింగ్స్ తో ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళ నోళ్ళు మూయించాడు. అతను ఎవరో కాదు సన్ రైజర్స్ కు ఆడుతున్న హ్యారీ బ్రూక్.. ఎన్నో అంచనాలతో ఐపీఎల్ లో అడుగుపెట్టిన బ్రూక్ తొలి మూడు మ్యాచ్ లలో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్ లో 13 , రెండో మ్యాచ్ లో 3 , మూడో మ్యాచ్ లో 13 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో 13 కోట్లు పెట్టి కొంటే 13 పరుగులే చేస్తాడా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కోటికో పరుగు చేసాడా.. వెళ్ళి టెస్టులు ఆడుకుంటే మంచిదంటూ సలహాలు కూడా ఇచ్చారు. ఐపీఎల్ లో ఆడడం అది కూడా భారత్ పిచ్ లపై ఆడడం తొలిసారి కావడంతో తడబడిన బ్రూక్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా మూడో మ్యాచ్ లో ఫలితం లేకపోయింది.
అయితే ఓపెనర్ గా చేసిన మార్పు నాలుగో మ్యాచ్ లో ఫలితాన్నిచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి బంతి నుంచే కోల్‌కతా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మధ్యలో స్పిన్నర్ల బౌలింగ్‌లో కొంత తడబడినా… క్రమంగా పుంజుకున్నాడు. తొలి 12 బంతుల్లో 32 పరుగులు చేసిన బ్రూక్ .. తర్వాత 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే పేసర్లు రంగంలోకి దిగగానే బ్రూక్ మళ్లీ తన బాదుడు మొదలు పెట్టాడు. ఫీల్డింగ్‌లో ఉన్న గ్యాప్‌లను చక్కగా గుర్తించి చూడచక్కని ప్లేస్ మెంట్ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. బ్రూక్ 55 బంతుల్లో శతకం సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో నిన్నటి వరకూ ట్రోలింగ్ చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం అయిందేదో అయిపోయింది విమర్శలు ఏవీ మనసులో పెట్టుకోకు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐపీఎల్ ఎంట్రీకి ముందు ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. తొలి 8 ఇన్నింగ్స్ లలో 800కు పైగా పరుగులు చేసిన క్రికెటర్ గానూ నిలిచాడు. దీంతో వేలంలో సన్ రైజర్స్ బ్రూక్ కోసం భారీ ధర వెచ్చించింది. తొలి మూడు మ్యాచ్ లలో విఫలమై విమర్శలు ఎదుర్కొన్నా… ఈడెన్ గార్డెన్స్ లాంటి స్టేడియం సెంచరీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
𝙃𝙖𝙧𝙧𝙮 𝙋̶𝙤̶𝙩̶𝙩̶𝙚̶𝙧̶ 𝘽𝙍𝙊𝙊𝙆 😃
The @SunRisers batter cast a spell with his magical 🪄 knock to become the first centurion of #TATAIPL 2023 👏👏 #KKRvSRH
Sit back & enjoy that BLITZ 🎥🔽 https://t.co/a5R3FONoqi
— IndianPremierLeague (@IPL) April 14, 2023