India Women Win Series: భారత మహిళల సరికొత్త చరిత్ర…ఇంగ్లాండ్ గడ్డపై క్లీన్‌స్వీప్
ఇంగ్లీష్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.
- Author : Naresh Kumar
Date : 24-09-2022 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంగ్లీష్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఇంగ్లాండ్‌లో క్లీన్‌స్వీప్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ ట్వంటీ సిరీస్‌లో ఓడినప్పటకీ… ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోని హర్మన్‌ప్రీత్ సేన వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. మూడు వన్డేల్లోనూ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన సిరీస్‌ను స్వీప్ చేసింది. తద్వారా అంతర్జాతీయ కెరీర్ ముగించిన ఝలన్ గోస్వామికి గ్రాండ్ విక్టరీతో సెండాఫ్ ఇచ్చింది.
చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 169 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో రాణించినా… షెఫాలీ వర్మ, వికెట్ కీపర్ భాటియా , కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ , డియోల్ నిరాశపరిచారు. దీంతో కేవలం 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీప్తి శర్మ, మంధానతో కలిసి జట్టును ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. స్మృతి మంధాన 50 పరుగులకు ఔటవగా… తర్వాత దీప్తి శర్మ, టెయిలెండర్లతో కలిసి స్కోర్ 150 దాటించింది. చివర్లో పూజా వస్త్రాకర్ 22 రన్స్ చేయగా… మిగిలిన బ్యాటర్లు డకౌటయ్యారు. చివర్లో ఎక్కువసేపు దీప్తినే స్ట్రైకింగ్ తీసుకుంటూ పోరాడే స్కోర్ అందించింది. భారత్ ఇన్నింగ్స్ 45.4 ఓవర్లలో ముగియగా.. దీప్తి శర్మ 106 బంతుల్లో 7 ఫోర్లతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత పేసర్లు హడలెత్తించారు. రేణుకా సింగ్, ఝులన్ గోస్వామి ఇంగ్లాండ్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఓపెనర్ లాంబ్ , వికెట్ కీపర్ జోన్స్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. చివర్లో చార్లెట్ డీన్ పోరాడడంతో స్కోర్ 100 దాటింది. అయితే రాజేశ్వరి గైక్వాడ్ కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్ 4, ఝులన్ గోస్వామి 2 , రాజేశ్వరి 2 వికెట్లు పడగొట్టారు.ఇంగ్లాండ్ గడ్డపై భారత్ మహిళల జట్టుకు ఇదే తొలి క్లీన్‌స్వీప్. అటు ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ కు ఝులన్ గోస్వామి వీడ్కోలు పలికింది.
Tremendous bowling performance from #TeamIndia to seal a 3-0 series win! 👏👏
Scorecard ▶️ https://t.co/RwUqefmJT6 #ENGvIND pic.twitter.com/i80xKew4Wy
— BCCI Women (@BCCIWomen) September 24, 2022