TCongress: రూ.500 సబ్సిడీ సిలిండర్ అర్హులకు అందేనా.. పథకం అమలుపై ప్రశ్నలు
- Author : Balu J
Date : 27-02-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
TCongress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి టీకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేసే దిశగా వెళ్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే సబ్సిడీ సిలిండర్ అందించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటి ఆధారంగానే కొత్త గ్యారంటీలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో రేషన్ కార్డుదారులకు మాత్రమే సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది సీఎం ప్రకటించారు.
ఇక రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 40 లక్షల మంది మాత్రమే సబ్సిడీ గ్యాస్, రూ.500 గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వీరంతా ప్రస్తుతం సబ్సిడీకి వీరంతా దూరం కానున్నారు. కొందరు దరఖాస్తుల్లో సబ్సిడీ విద్యుత్, గ్యాస్ ఆప్షన్ ఎంచుకోలేదు. ఈ కారణంగా కూడా దరఖాస్తు చేసుకున్నవారిలో కూడా 5 లక్షల మంది అర్హత కోల్పోయారని సమాచారం. ఆరు గ్యాంరటీల్లో ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యాంరటీలను అమలు చేస్తోంది.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. గ్యాస్, ఉచిత, ఈ రెండు పథకాలను రేషన్ కార్డు ఉన్నవారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు లేనివారు కూడా అభయహస్తంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, రేషన్ కార్డుదారులను మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో చాలామంది ఈ పథకానికి దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.