Bacterial Infection: 113 దేశాల్లో చాక్లెట్ల కలకలం.. పిల్లలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్!!
బ్రిటన్ , అమెరికా సహా దాదాపు 113 దేశాలను ఒక కొత్త బ్యాక్టీరియా దడ పుట్టిస్తోంది. ప్రధానంగా పిల్లలు, వృద్దులపై ప్రభావం చూపుతున్న ఈ బ్యాక్టీరియా పేరు ' సాల్మోనెల్లోసిస్'.
- By Hashtag U Published Date - 01:41 PM, Thu - 28 April 22

బ్రిటన్ , అమెరికా సహా దాదాపు 113 దేశాలను ఒక కొత్త బ్యాక్టీరియా దడ పుట్టిస్తోంది. ప్రధానంగా పిల్లలు, వృద్దులపై ప్రభావం చూపుతున్న ఈ బ్యాక్టీరియా పేరు ‘ సాల్మోనెల్లోసిస్’. ఇప్పటివరకు దీనితో ముడిపడిన 150కిపైగా కేసులను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. వీటిలో అత్యధికంగా 65 కేసులు బ్రిటన్ లో, 26 కేసులు బెల్జియం లో, 25 కేసులు ఫ్రాన్స్ లో, 15 కేసులు ఐర్లండ్ లో, 10 కేసులు జర్మనీ లో, 1 కేసు అమెరికాలో వెలుగుచూశాయి. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇప్పటివరకు మరణాలు సంభవించలేదు. కానీ, 5 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సున్న చిన్నారులే దీని బారిన పడ్డారు.
సాల్మోనెల్లోసిస్ అంటే..
సాల్మోనెల్లా అనేది ఒక రకమైన ఆహార బ్యాక్టీరియా. ఇది సాధారణంగా చిన్నపేగుల్లో కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపిస్తుంది. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా నుంచి సోకడం వల్ల ఈ వ్యాధికి సాల్మోనెల్లోసిస్ అనే పేరు వచ్చింది. సాధారణంగా కోళ్లు, పందులు, కుక్కలు, పిల్లులు, తాబేళ్లు, పక్షులు, పశువుల్లో ఈ రకం బ్యాక్టీరియాలు ఎక్కువగా వ్యాప్తిలో ఉంటాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. అయితే గుడ్లు, మాంసం,పాలు, పౌల్ట్రీ ఉత్పత్తులను వినియోగించే క్రమంలో ఈ బ్యాక్టీరియాలు మనుషులకు సోకుతుంటాయని వివరించింది. పచ్చి లేదా సరిగ్గా వండని మాంసం, గుడ్లు,
కడగని పండ్లు, కూరగాయలు, పాశ్చురైజేషన్ చేయని పాల నుంచి ఈ బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయి.
లక్షణాలు ఏంటి ?
ఈనేపథ్యంలో 113 దేశాల పరిధిలో దాదాపు 2,500 మంది సీరో శాంపిళ్లను డబ్ల్యూహెచ్వో సేకరించి విశ్లేషించింది . దీంతో వారిలో అత్యధికులకు టైఫాయిడ్ కారక ‘సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా’, ఒక రకమైన ఫుడ్ పాయిజనింగ్ ను కలుగజేసే ‘సాల్మొనెల్లా ఎంటరిటీడీస్ బ్యాక్టీరియా ‘ సోకినట్లు వెల్లడైంది. ఇవి సోకిన 6 నుంచి 72 గంటల తర్వాత .. జ్వరం, పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, అతిసారం వంటి లక్షణాలు బయటపడతాయని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. బ్రిటన్ లో గుర్తించిన ‘సాల్మోనెల్లోసిస్’ బ్యాక్టీరియా స్ట్రెయిన్ పెన్సిలిన్స్, ఏమైనా గ్లైకోసైడ్స్, ఫినికోల్స్, సలీఫోనమిడ్స్ , ట్రీమ్తొప్రైమ్, టెట్రా సైక్లిన్స్ వంటి 6 రకాల యాంటీ బయోటిక్ లకు కూడా లొంగడం లేదని బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ గుర్తించింది.
ఇజ్రాయెల్ కిండర్ చాక్లెట్ల వల్లేనా ?
ఇజ్రాయెల్ కు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ ‘ స్ట్రాస్ గ్రూప్’ తయారు చేసే కిండర్ చాక్లెట్ల వల్ల ఐరోపా దేశాల్లో సాల్మోనెల్లోసిస్ కేసులు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కంపెనీకి ఉత్తర ఇజ్రాయెల్ లో ఉన్న కిండర్ చాక్లెట్ల తయారీ ప్లాంట్ లో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఈనేపథ్యంలో స్ట్రాస్ గ్రూప్ తమ కిండర్ చాక్లెట్ల ను స్వచ్చందంగా రీకాల్ చేసింది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ లోనూ పలువురు పిల్లల్లో సాల్మోనెల్లోసిస్ లక్షణాలు బయటపడ్డాయని అక్కడి మీడియా కథనాలను ప్రచురించింది.
బ్రిటన్ లో ‘ కిండర్ సర్‌ప్రైజ్’ చాక్లెట్ల కలకలం ?
బ్రిటన్‌లో బయటపడిన సాల్మోనెల్లోసిస్ కేసులతో ‘ కిండర్ సర్‌ప్రైజ్’ అనే చాక్లెట్లకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వాటిని మార్కెట్ నుంచి వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. చాక్లెట్ల వంటి ఆహార ఉత్పత్తుల్లో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఫుడ్ పాయిజన్‌కు దారితీస్తుందని అంటున్నారు. ఈ చాక్లెట్ల ను బెల్జియంలోని ఒకే ఫ్యాక్టరీలో తయారూ చేశారని ‘ద ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ’ (ఎఫ్‌ఎస్‌ఏ) తెలిపింది. 20 గ్రాముల సైజులో.. 11 జూలై 2022 నుంచి 7 అక్టోబర్ 2022 వరకు గడువు తేదీలు ఉన్న
కిండర్ సర్‌ప్రైజ్ చాక్లెట్లను తినొద్దని సూచించింది. కిండర్ బ్రాండ్ తయారు చేసిన ఇతర ఉత్పత్తులు ఈ బ్యాక్టీరియా బారిన పడలేదని నమ్ముతున్నట్లు ఎఫ్‌ఎస్‌ఏ స్పష్టం చేసింది.అయితే మార్కెట్‌లో ఉన్న కిండర్ ఉత్పత్తుల్లో ఒక్కటి కూడా సాల్మొనెల్లా పాజిటివ్‌గా తేలలేదని చాక్లెట్ తయారీ కంపెనీ ఫెర్రారో చెప్పింది. సాల్మొనెల్లా కేసుల పెరుగుదలకు కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు ఆహార భద్రతా అధికారులతో కలిసి ఫెర్రారో పనిచేస్తోందని వెల్లడించింది.