Army Aspirant: 50 గంటల్లో 350 కి.మీ.. ఆర్మీ అభ్యర్థి నిరసన పరుగు!
సైనికుడిగా దేశానికి సేవ చేయాలని.. దేశ రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని చాలామంది యువకులు చెబుతారు.
- By Hashtag U Published Date - 12:56 PM, Thu - 7 April 22

సైనికుడిగా దేశానికి సేవ చేయాలని.. దేశ రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని చాలామంది యువకులు చెబుతారు. అది దేశంపై వారికున్న ప్రేమ. అందుకే ఆర్మీలో చేరాలనుకుంటారు. కానీ కరోనా వల్ల రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్లు నిలిచిపోయాయి. దానికోసం ఇప్పటికీ వెయ్యి కళ్లతో ఎదురుచూసేవారు ఉన్నారు. కానీ సురేశ్ భీంచర్ అనే 24 ఏళ్ల యువకుడు మాత్రం వినూత్నంగా తన కోరికను, నిరసనను తెలియజేశాడు. దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం.. పరుగు.
రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు పరిగెట్టమంటే ఎవరైనా సరే కళ్లే తేలేస్తారు. మా వల్ల కాదు బాబోయ్ అని సైడైపోతారు. కానీ సురేశ్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఆర్మీ రిక్రూట్ మెంట్లు చేపట్టాలన్న ఒకే ఒక్క డిమాండ్ ను పరుగు రూపంలో తెలియజేయాలనుకున్నాడు. అందుకే రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు ఉన్న దాదాపు 350 కిలోమీటర్ల దూరాన్ని పరుగు ద్వారానే చేరుకోవాలనుకున్నాడు. రాజస్థాన్ లోని సికార్ ప్రాంతవాసి సురేశ్ భీంచర్. ఆర్మీ రిక్రూట్ మెంట్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేస్తున్న అభ్యర్థులను కలవడమే తన లక్ష్యం. అందుకే మార్చి 29న పరుగు యాత్రకు శ్రీకారం చుట్టాడు. అక్కడి జిల్లా స్టేడియం నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేశాడు. చేతిలో జాతీయ పతాకాన్ని పట్టుకున్నాడు. రోడ్ల వెంట పరుగు మొదలుపెట్టాడు. ఆ పరుగు అలాగే కొనసాగుతూ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు.. అలా 50 గంటలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 2కు అతడు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నాడు.
గంటకు ఆరు కిలోమీటర్ల సగటు పరుగుతో సురేశ్ ప్రయాణించాడు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సురేశ్ పరుగు ప్రారంభమయ్యేది. ఉదయం 11 గంటల సమయంలో కనిపించిన పెట్రోల్ బంక్ వద్ద ఆగేవాడు. ఒక్కరోజు మాత్రమే హోటల్ లో భోజనం చేశాడు. కానీ ఆయన సంకల్ప యాత్ర గురించి తెలుసుకున్న ఇతర అభ్యర్థులు సురేశ్ కు భోజనం ఏర్పాట్లు చేసేవారు. సురేశ్ కూడా ఆర్మీలో చేరాలని 2015 నుంచి ప్రయత్నిస్తున్నాడు. 2018లో నాగౌర్ లోని రిక్రూట్ మెంట్ ర్యాలీలో 1600 మీటర్ల పరుగు లక్ష్యాన్ని 4.4 నిమిషాల్లోనే పూర్తిచేసి శభాష్ అనిపించుకున్నాడు. కాకపోతే అప్పుడు సెలక్ట్ కాలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఇలా తన తోటివారికి మద్దతిస్తున్నాడు. ఏదేమైనా సురేశ్ సంకల్పానికి మాత్రం సలామ్ చేయాల్సిందే.
#WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI
— ANI_HindiNews (@AHindinews) April 5, 2022