TET: టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారా.. అర్హతలు ఇవే
- By Balu J Published Date - 05:14 PM, Sat - 23 March 24

TET: రాష్ట్రంలో మార్చి 15న టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షకు కొన్ని అర్హతలున్నాయి.
టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.
టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించనున్నారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు – 60 మార్కులు కేటాయించారు.
పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.