Priest Murder: పూజారి దారుణ హత్య.. పోలీస్ వాహనానికి నిప్పు
పూజారి హత్యకు కారణం పోలీసుల వైఫల్యమేనంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనానికి నిప్పంటించారు.
- By News Desk Published Date - 07:37 PM, Sun - 17 December 23

Priest Murder: దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ లో చోటు చేసుకుంది. స్థానిక దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ (32)ను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. పూజారి మృతదేహం పొదల్లో ఉండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శనివారం సాయంత్రం దేవాలయం సమీపంలో ఉన్న పొదల నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూజారి హత్యకు గురయ్యాడన్న విషయం తెలుసుకున్న దానాపుర్ గ్రామస్తులు.. ఆదివారం ఆందోళనకు దిగారు.
పూజారి హత్యకు కారణం పోలీసుల వైఫల్యమేనంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనానికి నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. మనోజ్ కుమార్ మిస్సింగ్ పై అతని కుటుంబ సభ్యులు మంగళవారమే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. కానీ.. మనోజ్ శవమై కనిపించాడు. మనోజ్ కుమార్ సోదరుడు గతంలో బీజేపీ కార్యకర్తగా పనిచేశారని పోలీసులు తెలిపారు. గోపాల్ గంజ్ లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.