‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అనలేదు
‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ షేర్ అవుతోంది.
- By Dinesh Akula Published Date - 02:11 PM, Tue - 26 October 21

ప్రధాన తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ఈ వార్త వచ్చినట్టు చెప్తూ చాలామంది షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ స్టేట్‌మెంట్‌లో నిజముందా? ఓ సారి చూద్దాం..
సోషల్ మీడియాలో షేక్ అవుతున్న ఈ వార్త గురించి ఇంటర్నెట్‌లో వెతికితే బీజేపీ ఎంపీ అర్వింద్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా దొరకలేదు. ఒకవేళ నిజంగానే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిఉంటే ప్రధాన వార్తాప్రతికలు, న్యూస్ ఛానల్స్ దాన్ని రిపోర్ట్ చేసేవి. కానీ.. ఏ వార్తా సంస్ధ కూడా ఇలాంటిది ప్రచురించినట్టు కనిపించలేదు. షేర్ అవుతున్న క్లిప్‌లో అక్టోబర్ 21వ తారీఖు ఈ వార్త ప్రచురితమయినట్టు చెబుతున్నారు. కానీ.. ఆ తేదీకి అటు ఇటు రెండ్రోజులు పేపర్‌లో ఎక్కడా ఈ వార్త కనిపించలేదు.
దీనితో పాటు 24వ తారీఖు ఆంధ్రజ్యోతి పేపర్ అప్పటికే వైరల్ అవుతున్న ఈ వార్త గురించి ఓ స్టేట్‌మెంట్ ప్రచురించింది. అర్వింద్ వ్యాఖ్యలు కానీ.. దానిపై కరీంనగర్ టూటౌన్‌లో కేసుపెట్టినట్టు కానీ తాము ఎలాంటి న్యూస్ ప్రచురించలేదన్నది ఆ స్టేట్‌మెంట్ సారాంశం. మరోవైపు ధర్మపురి అరవింద్ కూడా ఇది ఫేక్ న్యూస్ అంటూ ట్విట్టర్‌లో ప్రకటించారు.,
Andhra Jyothi Karimnagar unit edition filed complaint against the Fake News propagated by factions of malicious intents against me. pic.twitter.com/uFMD7iJZjx
— Arvind Dharmapuri (@Arvindharmapuri) October 24, 2021
ఇటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ కూడా ధర్మపురి అర్వింద్ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఏమీ చేయలేదని మీడియాకు వివరించారు. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్త ఫేక్..