BRS Minister: అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు ఎత్తిపోతలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోంది: నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ పనితీరు, తమ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.
- Author : Balu J
Date : 30-09-2023 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ పనితీరు, తమ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఎక్కి చూస్తే ఎక్కడచూసినా నీళ్లే. రామాయణంలో తల్లిదండ్రుల దూప తీర్చడానికి శ్రవణకుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం వందలాది మంది శ్రవణ కుమారులు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. అటు కాళేశ్వరం ఎత్తిపోతల అయినా, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అయినా వీటిని ఎవరూ కలగనలేదు. ఇన్ని వందల మీటర్ల ఎత్తున జలాలు ఎగసిపడతాయంటే ఎవరూ నమ్మలేదు.
ఇప్పుడు వాటిని చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండితే ఒక్కోసారి కాలమైనా, కాకున్నా కడుపు నిండుతుందన్న భరోసా వచ్చింది. ఇంట్లో పిడికెడు బియ్యముంటే ఆ ధైర్యమే వేరు. పొయ్యి కిందకు ఎవరైనా ఇస్తరు. పొయ్యి మీదకు ఎవరిస్తారు? మగ పిల్లోనికి ఎంత భూమున్నా పిల్లనగ్రోవి కాదు. ఆడపిల్లల పెండ్లిండ్లు కూడా కష్టంగా ఉండేది. కష్టాలు తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ దూరమైనవి. వలస బతుకులు ఆగిపోయినవి. వలసెల్లిన జిల్లాకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం వలస వస్తున్నారు. ఎవరైనా వస్తే మేం ఆదరిస్తాం. కృష్ణమ్మ నీళ్లతో మా ఊరి దేవతల పాదాలు కడిగినప్పుడే మా దరిద్రం పోయింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు, రైతులు, ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ నిండునూరేండ్లు చల్లగా ఉండాలి’’ అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు.