AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్..!
- By HashtagU Desk Published Date - 11:57 AM, Mon - 7 March 22

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపధ్యంలో, గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు బహిష్కరించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా, టీడీపీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్, గో.. బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అంతే కాకుండా గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గాల్లోకి విసిరేశారు టీడీపీ సభ్యులు.
ఇక గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు, ఆయన ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు మార్షల్స్. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్షల్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ సభ్యులు లాబీల్లో నిరసన వ్యక్తం చేస్తూ బైఠాయించారు. దీంతో శాసనమండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ నారా లోకేష్ మండిపడ్డారు. సభలో ఎలాగూ మాట్లాడనివ్వరు.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మార్షల్స్ తో వాగ్వాదం చోటుచేసుకుంది.