సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి
- Author : Vamsi Chowdary Korata
Date : 11-03-2026 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
Supreme Court Allows Passive Euthanasia For Harish Rana గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది.
13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా, పూర్తిగా ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కొనసాగించడం రోగి ప్రయోజనాలకు మేలు చేస్తుందా? లేదా? అన్నదే కీలకమని వ్యాఖ్యానించింది.
చదువులో చురుకుగా ఉండే యువకుడు ఇలా జీవచ్ఛవంగా మారడం బాధాకరమని కోర్టు పేర్కొంది. 13 ఏళ్లుగా అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, కోలుకునేందుకు ఏమాత్రం అవకాశం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో చికిత్సను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా పైపుల ద్వారా అందించే పోషకాహారం కూడా వైద్య చికిత్స కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యుల బృందం పరిశీలించి, రోగి కోలుకునే అవకాశం లేదని నిర్ధారించిన పక్షంలో లైఫ్ సపోర్ట్‌తో పాటు పోషకాహారాన్ని కూడా నిలిపివేయవచ్చని ఈ తీర్పుతో స్పష్టమైంది.