Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ప్రవీణ్ కుమార్ బలవన్మరణం చెందడంతో.. కాలేజీ వైస్ ఛాన్సలర్ దిగ్భ్రాంతి చెందారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు అవుట్ పాస్..
- By News Desk Published Date - 07:27 PM, Sun - 26 November 23

Basara IIIT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ భవనంలో ఉన్న నాల్గవ అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని.. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఆసుపత్రికి తరలించారు. కాగా.. నాగర్ కర్నూల్ కు చెందిన ప్రవీణ్ కుమార్.. ఈ ఏడాదే ట్రిపుల్ ఐటీలో చేరాడు. వ్యక్తిగత కారణాల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.
ప్రవీణ్ కుమార్ బలవన్మరణం చెందడంతో.. కాలేజీ వైస్ ఛాన్సలర్ దిగ్భ్రాంతి చెందారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు అవుట్ పాస్ జారీ చేయాలని ప్రవీణ్ కుమార్ అభ్యర్థించాడని తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అవుట్ పాస్ తీసుకున్న ప్రవీణ్.. ఊరికి వెళ్లాల్సి ఉండగా.. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రవీణ్ తనగదిలో కాకుండా.. మరో గదికి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిపారు. ప్రవీణ్ మరణంతో బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.