IPL: త్వరలో హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు.. పోలీసులు భారీ బందోబస్తు
- By Balu J Published Date - 06:35 PM, Tue - 19 March 24

త్వరలో ఐపీఎల్ సందడి మొదలుకాబోతుంది. ఈ సమ్మర్ లో క్రికెట్ మజాలో మునిగిపోయేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుబోయే మ్యాచ్ లకు భారీ భద్రత కల్పించనున్నట్టు రాచకొండ కమిషనరేట్ అధికారులు తెలిపారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ల నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు, సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. టికెట్ల పంపిణీ విషయంలో ఎలాంటి గందరగోళం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు తరుణ్ జోషి.
ఈ మేరకు ఐపీఎల్ నిర్వహణ బృందంతో కూడా టికెట్ల పంపిణీపై మాట్లాడారు. స్టేడియం వద్ద ప్రేక్షకుల కోసం అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లను చూసుకోవాలని కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేశారు. ఉప్పల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ముందుగానే పలు వాహనదారులకు పలు సూచనలు చేయాలని చెప్పారు.
అలాగే స్టేడియం పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. అవి నిత్యం పనిచేసేలా చూసుకోవాలని కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపై దృష్టి పెట్టాలనీ.. సాధారణ ప్రజలు మోసపోకుండా చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అధికారులకు చెప్పారు.