ఏపీ బాట పట్టబోతున్న వైస్ షర్మిల..?
రాజన్న బిడ్డగా షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవచ్చని
- By Sudheer Published Date - 11:00 AM, Fri - 11 August 23

వైస్ షర్మిల ఏపీ బాట పట్టబోతుందా..? అంటే అవుననే చెప్పాలి. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి కూతురిగా మార్క్ చూపించాలని ఎన్నో కలలు కన్నా షర్మిల ‘కల’ కలగానే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తా..రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తా..కేసీఆర్ ని గద్దె దించుతా..దొరల పాలనా అంతం చేస్తా అంటూ భారీ సవాళ్లు చేస్తూ తెలంగాణ లో YSRTP (YSR తెలంగాణ పార్టీ ) స్థాపించిన వైస్ షర్మిల (YS Sharmila)..ఎంతో కాలం గడవకముందే కనీసం ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీ ని కలిపేందుకు సిద్ధమైంది. పార్టీ స్థాపించిన వెంటనే షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టింది.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి మంగళవారం దీక్షలు చేపట్టింది..కేసీఆర్ (KCR) కు వ్యతిరేకంగా గట్టిగానే ఒంటరిగా ట్రై చేసింది. కానీ ఇవేమి కూడా పార్టీ కి బలం తీసుకరాలేకపోయాయి. ఏ ఒక్క నేత కూడా షర్మిల పార్టీ లో చేరలేదు. ఎటు వెళ్లిన పది మందిని వెంటేసుకొని వెళ్ళింది తప్ప..రాజకీయ నేతలు ఎక్కడ..ఎవ్వరు కనిపించలేదు. ఇక రాష్ట్రంలో బహు పార్టీల నేపథ్యంలో షర్మిళ పార్టీకి అనుకున్నంత స్థాయిలో హైప్ రాలేదు. ఇవన్నీ చూస్తూ వచ్చిన షర్మిల..ఇక పార్టీ ని నడపడం కంటే ఏదొక పార్టీ లో కలపడం మంచిదని డిసైడ్ అయ్యింది.
ఇదే క్రమంలో కర్ణాటక లో కాంగ్రెస్ విజయం సాధించడం..తెలంగాణ లోను కాంగ్రెస్ దూకుడు పెంచడం..ఏపీలో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దిక్కు లేకపోవడం తో..తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం (YSRTP merge Congress) చేయాలనీ డిసైడ్ అయ్యింది. వారం రోజులుగా బెంగళూరులో మకాం వేసిన షర్మిల.. డీకే శివకుమార్ నేతృత్వంలో తన రాజకీయ ప్రయాణం సాగిస్తుంది. శివ కుమార్ తో గంటలకొద్దీ ఏకాంతంగా రాజకీయ చర్చలు జరుపుతున్నట్టు వినికిడి. ఆయన సూచనలతోనే ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో రెండు , మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.
తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచీ షర్మిలకు ప్రతిపాదన రావడంతో ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఏపీలో పార్టీ పునరుజ్జీవం, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదన్న సంకల్పం దృష్ట్యానే కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పాలేరు లేకపోతే సికింద్రాబాద్‌లో షర్మిల పోటీ చేస్తారని నిన్న , మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినా పోటీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన పార్టీని విలీనం చేసినందుకు ఆమెకు రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఐతే.. పార్టీ విలీనం తర్వాత షర్మిల ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు (President of AP Congress Party) తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది.
దివగంత నేత, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే సీఎం అయ్యారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఇటు తెలంగాణ లో కానీ.. అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయింది. రాజన్న తమ వాడు అని చెప్పుకోలేకపోయింది. ఆయన కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ జగన్ వైపు చూడగా.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అటు రాజశేఖర్‌రెడ్డిని తమ వాడు అని వాడుకోలేక నాయకత్వ లేమితో ఇబ్బందిపడ్డారు. రాజన్న బిడ్డగా షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవచ్చని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అలాగే జగన్‌పై పోరాటానికి షర్మిలనే అస్త్రంగా వాడుకోవాలని అధిష్టానం చూస్తుంది. అందుకే షర్మిల కు ఏపీ పగ్గాలు అందజేయాలని చూస్తుంది. ఒకవేళ షర్మిల సై అని డిసైడ్ అయితే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయి. మరి షర్మిల నిర్ణయం ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Read Also : Flying Kiss : మొన్న రాహుల్..నిన్న కేటీఆర్..ఏంటి ఈ ఫ్లయింగ్ కిస్ లు..?