PM Modis Degree Row : ప్రధాని మోడీ డిగ్రీపై మరోసారి కోర్టులో విచారణ.. ఏమిటీ కేసు ?
అయితే ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వకుండా ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1)(ఈ) మినహాయింపు కల్పించింది’’ అని తుషార్ మెహతా(PM Modis Degree Row) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 11:23 AM, Tue - 14 January 25

PM Modis Degree Row : ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిగ్రీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ చేసిన డిగ్రీ వివరాలను వెల్లడించలేమంటూ ఢిల్లీ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం రోజు విచారణ జరిగింది. ఈసందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘ఎవరికో ఆసక్తి అనిపించిన సమాచారాన్ని బయటపెట్టడానికి సమాచార హక్కు చట్టాన్ని (ఆర్‌టీఐ) వాడకూడదు. ఇతరులలోని ఆసక్తిని సంతృప్తిపర్చడానికి ఉద్దేశించిన అంశం ఆర్‌టీఐ కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజా సంస్థల పారదర్శకత, జవాబుదారీతనంతో సంబంధం లేని అంశాలపై సమాచారాన్ని అడిగేందుకు ఆర్‌టీఐను వాడకూడదు’’ అని తుషార్ మెహతా కోర్టులో తెలిపారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం ఎదుట ఈమేర వాదనలు వినిపించారు.
థర్డ్ పార్టీకి ఇవ్వొద్దు..
‘‘ఎవరైనా డిగ్రీ చేసిన వ్యక్తి తన డిగ్రీ వివరాలు లేదా మార్కుల షీట్‌ను ఇవ్వాలని యూనివర్సిటీని కోరుతూ ఆర్‌టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేయొచ్చు. అయితే ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వకుండా ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1)(ఈ) మినహాయింపు కల్పించింది’’ అని తుషార్ మెహతా(PM Modis Degree Row) పేర్కొన్నారు. ‘‘గతంలో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జారీ చేసిన ఆదేశాలు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. వాటి అమలును కోర్టు అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే రానున్న కాలంలో అదే తరహాలో మరిన్ని ఆదేశాలు జారీ అయ్యే ముప్పు ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ వద్ద 1922 సంవత్సరం నుంచి చదివిన ప్రతి ఒక్క విద్యార్థి రికార్డులు భద్రంగా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి’’ అని తుషార్ మెహతా వివరించారు. ఈనెలాఖరులో మరోసారి అంశంపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
Also Read :Nitish Reddy : వీడియో వైరల్.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
ఈ కేసు ఇలా మొదలైంది..
- ప్రధాని మోడీ డిగ్రీ వివరాలను వెల్లడించడమని 2016 సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశాలు ఇవ్వడానికి కారణం.. సామాజిక కార్యకర్త నీరజ్ కుమార్.
- 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోడీ చేసిన బీఏ డిగ్రీ వివరాలు, రూల్ నంబర్లు, పేర్లు, మార్కులు, పాస్/ఫెయిల్ స్టేటస్ వంటి వివరాలను బయటపెట్టాలని ఆయన ఆర్‌టీఐ దరఖాస్తును సమర్పించారు.
- ఈ దరఖాస్తు ఢిల్లీ యూనివర్సిటీలోని సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు (సీపీఐఓ)కు చేరింది. అయితే నీరజ్ అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు సీపీఐఓ నిరాకరించారు. థర్డ్ పార్టీకి అలాంటి సమాచారాన్ని అందించలేమని వెల్లడించారు.
- దీంతో నీరజ్ కుమార్ నేరుగా సీఐసీ వద్ద ఆర్‌టీఐ అప్పీల్ చేశారు. అక్కడ నీరజ్‌కు అనుకూలంగా సీఐసీ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో చేసిన బీఏ డిగ్రీ వివరాలను తనిఖీ చేసేందుకు నీరజ్‌కు అనుమతి ఇవ్వాలని నిర్దేశించింది.
- అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ 2017 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ యూనివర్సిటీ పిటిషన్ వేసింది.
- దీంతో 2017 జనవరి 24న సీఐసీ ఆదేశాల అమలుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఆనాటి నుంచి దీనిపై విచారణ జరుగుతోంది.