Srilanka New PM: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే…అన్నీ సవాళ్లే..!
తీవ్ర నిరసన జ్వాలల్లో అట్టుడుకుతున్న శ్రీలంకలో గతకొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
- By Hashtag U Published Date - 08:21 PM, Thu - 12 May 22

తీవ్ర నిరసన జ్వాలల్లో అట్టుడుకుతున్న శ్రీలంకలో గతకొన్నాళ్లుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒత్తిడికి తలొగ్గిన ప్రధాని తన పదవి నుంచి మహింద రాజపక్సే తప్పుకున్నారు. ఇప్పుడు నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారు. ఆయన గురువారం సాయంత్రం పదవీ ప్రమాణస్వీకారం చేశారు.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సోదరుడు మహింద రాజపక్సే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటినుంచి రణిల్ విక్రమసింఘే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కొత్త ప్రధాని రేసులో ఆయనే ముందున్నారు. గతంలోనూ అనేక పర్యాయాలు ప్రధానిగా వ్యవహిరించిన రణిల్ విక్రమ సింఘే ఆరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీలో హర్షం వ్యక్తమైతోంది. యునైటెడ్ నేషనల్ పార్టీ ఛైర్మన్ వజిర అబేవర్దనే దీనిపై స్పందించారు. రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పార్లమెంటులో మెజార్టీ సభ్యుల మద్దతు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడం, వాణిజ్యం పడిపోవడం, నిత్యావసరాల ధరలు భగ్గుమంటుండటం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.