Bandi Sanjay: కాంగ్రెస్‌కు ‘శని’గా మారిన రాహుల్: బండి సంజయ్
మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
- By Hashtag U Published Date - 05:32 PM, Fri - 24 March 23

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు తెలంగాణ బిజెపి జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్. ఓ మీడియా సమావేశంలో బండి మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ…రాహుల్ కేవలం ప్రధాని మోడీని మాత్రమే కాకుండా ఓబీసీ వర్గాలను కూడా కించపరిచాడని ఫైర్ అయ్యారు. అందులో భాగంగా ఓబీసీ వర్గాలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ వ్యక్తిత్వం వల్లనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని చురకలంటించారు.
ఓబీసీలను ధిక్కరించడం, న్యాయస్థానాలను కించపరచడం, చట్టాన్ని ఉల్లంఘించడం వంటివి కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి.గతంలో ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుతం రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు న్యాయవ్యవస్థను అగౌరవపరుస్తున్నారు. న్యాయస్థానం తీర్పును వెలువరించినప్పుడు, ఆ తీర్పును గౌరవించకపోగా న్యాయవ్యవస్థను తప్పుబడుతున్నారు. ఇది న్యాయవ్యవస్థను అవమానించడమే తప్ప మరొకటి కాదని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. కాంగ్రెస్‌కు ‘శని’గా మారిన రాహుల్ గాంధీ వల్లనే పార్టీ సంక్షోభంలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు.
2019 కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో ప్రధాని మోడీని కించపర్చే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారించిన కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి..రెండేళ్లు జైలు శిక్ష విధించింది. నిజానికి రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయకూడదు. .ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు.