T-SAT: టి-సాట్ ద్వారా ఇంటింటికీ ఉన్నత విద్య- వి.బాలకిష్టారెడ్డి
సీఈవో తన ఛాంబర్‌లో టి-సాట్ పనితీరు, ప్రాథమిక, ఇంటర్మీడియట్, పోటీ పరీక్షలు, ఇతర విభాగాలకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
- By Kode Mohan Sai Published Date - 05:43 PM, Mon - 28 October 24

తెలంగాణలోని ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యను టి-సాట్ ద్వారా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయాన్ని ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఇ. పురుషోత్తం మరియు కార్యదర్శి శ్రీ రాం వెంకటేశ్ తో కలిసి సోమవారం సందర్శించారు. టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, వి.బాలకిష్టారెడ్డి బృందానికి స్వాగతం పలికారు.
సీఈవో తన ఛాంబర్‌లో టి-సాట్ పనితీరు, ప్రాథమిక, ఇంటర్మీడియట్, పోటీ పరీక్షలు, ఇతర విభాగాలకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఉన్నత విద్యలో భాగమైన విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు టి-సాట్ వేదికను ఉపయోగించుకోవాలని కోరారు. భవిష్యత్‌లో నాణ్యమైన డిజిటల్ కంటెంట్‌ను ఉన్నత విద్యాభ్యసించుకునే వారికి అందించడానికి ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుందామని, ఉన్నత విద్యామండలి విడుదల చేసే పరీక్షా ఫలితాలను టి-సాట్ వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి కోరగా, ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి సానుకూలంగా స్పందించారు.
అనంతరం, టి-సాట్ కార్యాలయంలోని స్టూడియోలు మరియు వివిధ విభాగాలను పరిశీలించిన ఛైర్మన్, మౌళిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, ‘నాణ్యమైన, విలువైన విద్యను తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి అందించాలనేది మా ప్రధాన లక్ష్యం’ అన్నారు. ఉన్నత విద్యా మండలి 52 మాడ్యూల్స్‌లో ఉన్నత విద్యకు సంబంధించిన కంటెంట్ అందుబాటులోకి తెచ్చే విధంగా సిద్ధం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం తమపై ఉంచిన బాధ్యతలకు అనుగుణంగా విద్యా రంగాన్ని పటిష్టం చేస్తామని, ఆ ప్రక్రియలో టి-సాట్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.