PV Ramesh Statement : ఆ రిటైర్డ్ ఐఏఎస్ స్టేట్మెంట్ తో ‘స్కిల్ స్కాం’లో కీలక మలుపు.. అందులో ఏముంది ?
PV Ramesh Statement : పీవీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్.. చంద్రబాబు హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కామ్ డొంక మొత్తం కదిలింది.
- By Pasha Published Date - 12:08 PM, Sun - 10 September 23

PV Ramesh Statement : పీవీ రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్.. చంద్రబాబు హయాంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో కీలకంగా మారిందని తెలుస్తోంది. ఆనాడు ఏపీ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న పీవీ రమేష్.. సీమెన్స్‌కి నిధులు విడుదల చేసేందుకు నిరాకరించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని వారించారు. ఆ మేరకు సీఎస్‌కు లేఖ కూడా రాశారు. సీమెన్స్‌కి నిధులు రిలీజ్ చేయొద్దని సూచించారు. ఇదే విషయాన్ని సీఐడీ విచారణలోనూ పీవీ రమేష్ చెప్పడం గమనార్హం.
Also read : AP : చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ రెడీ చేస్తున్న పోలీసులు
కీలకంగా పీవీ రమేష్ స్టేట్మెంట్
చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేష్ ఇటీవల సీఐడీకి ఇచ్చిన స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ముఖ్యంగా మారాయి. ఇప్పుడు వాటిపై హాట్ డిబేట్ జరుగుతోంది. తన కంటే ముందు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా అజేయ కల్లామ్ ఉన్నప్పుడే సీమెన్సు ప్రాజెక్టు(Siemens Project)కు ఆమోదం లభించిందని పీవీ రమేష్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ఆమోదించడం దగ్గరి నుంచి నిధులను కేటాయించడం వరకు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం, నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డే కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. సీమెన్సు ఇండియా, డిజైన్ టెక్‌ల అర్హతల విషయానికొస్తే .. ఆనాడు గుజరాత్‌లో పర్యటించిన అధికారుల బృందం పరిశీలనలు మినహా పెద్దగా ఆధారాలేమీ తనకు అందలేదని సీఐడీకి పీవీ రమేశ్ బదులిచ్చారు. ఈ రెండు సంస్థలు ఎంతో పేరున్నవని.. నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఆనాడుతో తనకు చెప్పారని వెల్లడించారు.
అజేయకల్లాం ఆధ్వర్యంలోనే..
‘‘ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన బడ్జెట్ ను శాసనసభ (PV Ramesh Statement) కేటాయిస్తుంది. దానికయ్యే ఖర్చు, తదితర అన్ని అంశాలను ఆ ప్రాజెక్టును ఆమోదించే సమయంలోనే సమగ్రంగా పరిశీలించాలి. ఈ కసరత్తు అంతా నేను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడాని కంటే ముందే.. అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజేయకల్లాం ఆధ్వర్యంలోనే జరిగిపోయింది’’అని పీవీ రమేష్ స్పష్టంచేశారు.
Also read : G20 summit 2023 : చంద్రబాబు అరెస్ట్ తో G20 ని పట్టించుకోని తెలుగు ప్రజలు
పదే పదే నాకు గుర్తు చేసేవారు
నైపుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టులో సాంకేతిక భాగస్వాములైన సంస్థలకు ముందస్తుగానే డబ్బులు చెల్లించేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీపై ఒత్తిడి తెచ్చారా అన్న సీఐడీ ప్రశ్నలకు పీవీ రమేష్ ఇలా సమాధానమిచ్చారు. ‘‘ లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదే పదే నాకు గుర్తు చేసేవారు. నైపుణ్యాభివృద్ధి శాఖ నుంచి కూడా నిరంతరం ఆ డిమాండ్ ఉండేది. నా 61 ఏళ్ల జీవితంలో ఎన్నడూ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదు. నైతిక ప్రమాణాలకు, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా ఏ పనీ చేయలేదు’’ అని పీవీ రమేష్ చెప్పారు.