Prisoner attacks female Judge : మహిళా జడ్జిపై చెప్పుతో దాడి చేసిన ఖైదీ
Prisoner attacks female judge : సర్దార్ చీమకొర్తి (22) అనే ఖైదీ గతేడాది నార్సింగి ORR సమీపంలో దొంగతనానికి పాల్పడి ఒకరిని హత్య చేశాడు
- By Sudheer Published Date - 02:09 PM, Fri - 14 February 25

హైదరాబాద్‌లో కోర్టు (Hyderabad Court) ప్రాంగణంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీ విచారణ నిమిత్తం హాజరైన సమయంలో మహిళా జడ్జిపై చెప్పుతో దాడి (Prisoner attacks female Judge) చేశాడు. ఈ ఘటనతో కోర్టులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సర్దార్ చీమకొర్తి (22) అనే ఖైదీ గతేడాది నార్సింగి ORR సమీపంలో దొంగతనానికి పాల్పడి ఒకరిని హత్య చేశాడు. పోలీసుల తనిఖీల్లో ఈ ఘటన బయటపడటంతో అతడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారు. అయితే, అతను సహకరించకుండా తల్వార్తో పోలీసులపై దాడికి దిగాడు. చివరికి అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
Warning : హైదరాబాద్ వాసులారా.. ఈ చికెన్ తింటే నేరుగా హాస్పటల్ కే..!!!
ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తికావడంతో రాజేంద్రనగర్ కోర్టు జడ్జి అతడికి జీవితఖైదు విధించారు. అంతేగాక, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో కేసు విచారణ నిమిత్తం నిన్న కోర్టుకు హాజరుపర్చారు. విచారణ జరుగుతున్న సమయంలో అక్కసుతో అతడు మహిళా జడ్జిపై చెప్పు విసిరాడు. ఈ చర్యతో కోర్టు ప్రాంగణంలో భయాందోళనలు ఏర్పడ్డాయి. అక్కడే ఉన్న లాయర్లు, కోర్టు సిబ్బంది వెంటనే స్పందించి ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై తీవ్ర ఆగ్రహానికి గురైన లాయర్లు అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులు అతడిని మళ్లీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఈ సంఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో భద్రతా వ్యవస్థను మరింత కఠినతరం చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయ వర్గాలు సూచించాయి.