Badrinath temple: బద్రీనాథ్ ఆలయం మూసివేత..!
బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడ్డాయి.
- By Gopichand Published Date - 04:31 PM, Sat - 19 November 22
బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. శీతాకాలం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ సందర్భంగా సింహద్వారాన్నిఅనేక క్వింటాళ్ల బంతిపూలతో అలంకరించారు. రాబోయే ఆరు నెలల పాటు పాండుకేశ్వర్, జోషిమఠ్‌లో బద్రీనాథుడికి పూజలు జరుగనున్నాయి. విపరీతమైన మంచు కారణంగా ప్రతీ ఏడాది ఆలయాన్ని మూసి ఉంచుతారు.
వార్షిక ముగింపు వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బద్రీనాథ్ కు చేరుకున్నారు. ఈ ఏడాది 17 లక్షల 80 వేల మందికి పైగా భక్తులు బద్రీనాథ్‌ను దర్శించుకున్నారు. తలుపులు మూసివేయడంతో చార్ ధామ్ యాత్ర కూడా నేటితో ముగియనుంది. ఇప్పటికే కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి తలుపులు మూసేశారు. బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ప్రకారం.. ఈ సంవత్సరం 44 లక్షల మందికి పైగా భక్తులు చార్ ధామ్ యాత్రను సందర్శించారు. శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించరు. మళ్లీ మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.