Pope Francis : యేసు జన్మభూమిలో రక్తపాతం ఆపండి.. పోప్ ఫ్రాన్సిస్ పిలుపు
Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు శాంతి సందేశమిస్తూ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిలో క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు.
- By Pasha Published Date - 08:20 AM, Mon - 25 December 23

Pope Francis : పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు శాంతి సందేశమిస్తూ వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిలో క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. యేసు క్రీస్తు పవిత్ర జన్మభూమిలో యుద్ధంతో రక్తం పారుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ గత 80 రోజులుగా దాడులు చేస్తుండటం బాధాకరమన్నారు. పాలస్తీనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ గురించి ఆలోచిస్తే చాలా ఆందోళనగా ఉందని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఈ యుద్ధంతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని చెప్పారు. ‘‘ఇప్పుడు నా మనసంతా పాలస్తీనాలోని బెత్లెహెమ్‌లో ఉంది. ఆ శాంతి భూమిలో యుద్ధం చేయడం సరికాదు. సాయుధ సంఘర్షణతో ప్రపంచం ఏమీ సాధించలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. శాంతి, ప్రేమలే ప్రపంచాన్ని, మానవాళిని ఏకం చేయగలవని పోప్ ఫ్రాన్సిస్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు.బెత్లెహెమ్ నగరం పాలస్తీనాలోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వాటికన్ సిటీ ఐరోపా ఖండంలో ఉంది. ఈ దేశం వైశాల్యం కేవలం 108 ఎకరాలు. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉన్న.. ఈ దేశం అధికార భాష లాటిన్. కేవలం 30 నుంచి 40 నిమిషాల్లోనే ఈ వాటికన్ సిటీని చుట్టేయొచ్చు. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చి నాయకుడైన పోప్‌కు నిలయం. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చిని కూడా సందర్శించవచ్చు. ఈ చర్చిని వాటికన్‌లో బాసిలికా డి శాన్ పియట్రో అని పిలుస్తారు. ఈ పెద్ద చర్చి సెయింట్ పీటర్‌ను ఖననం చేసిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఆయన ఏసు 12 మంది శిష్యుల్లో ఒకరు. సెయింట్ పీటర్స్ బసిలికా సముదాయంలో దాదాపు 100 సమాధులు ఉన్నాయి.