Kishan Reddy: దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి
- By Balu J Published Date - 10:19 AM, Sat - 16 March 24

Kishan Reddy: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నిర్వహించిన భారీ రోడ్ షో విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు’’ అని ఆయన అన్నారు.
నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు మరో 5 సంవత్సరాలు సంక్షేమం అందించాలని ఆలోచన చేస్తున్నాం. వచ్చే పార్లమెంటు ఎన్నికల తర్వాత 4 సెక్టార్ల ద్వారా దేశంలో పని చేయబోతున్నాం. మహిళలు, యువకులు, రైతులు, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం. బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించండి”అని ఆయన కోరారు.
వచ్చే ఎన్నికలు ధర్మ యుద్ధం లాంటివి. ప్రజలు ఆలోచించి స్పందించాలి. పార్లమెంటు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. దేశం కోసం, ధర్మకోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ గౌరవాన్ని పెంచడం కోసం గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు.