Pawan Kalyan: ఢిల్లీ పొలిటికల్ `వీర`మల్లు
`గద్దెను ఎక్కించలేకపోవచ్చుగానీ, ఓడించగలం. అధికారంలోకి రావడానికి కాదు పార్టీ పెట్టింది. 30ఏళ్ల పాటు ప్రశ్నించడానికి.`
- By CS Rao Published Date - 05:04 PM, Sat - 20 August 22

`గద్దెను ఎక్కించలేకపోవచ్చుగానీ, ఓడించగలం. అధికారంలోకి రావడానికి కాదు పార్టీ పెట్టింది. 30ఏళ్ల పాటు ప్రశ్నించడానికి.` ఇవీ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు. ఆ తరువాత రాజ్యాధికారం కోసం 2019 ఎన్నికల్లో లెఫ్ట్ టర్న్ తీసుకున్నారు. ఘోరంగా ఓడిపోయిన తరువాత ఏ మాత్రం వెనుకాడకుండా పూర్తి `రైట్` మార్గం పట్టారు. తొలి రోజుల్లో చేగువీరా, కాన్షీరాం, చాకలి ఐలమ్మ, లెనిన్ , కార్ల్ మాక్స్ ఇలా పలువురి భావజాలన్ని మిక్స్ చేసి పవనిజాన్ని వినిపించారు. మూడేళ్లుగా మోడీయిజాన్ని మోస్తోన్న జనసేనాని పవన్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా చేస్తానని జనసేన ఎనిమిదో ఆవిర్భావ సభలో నినదించారు. అందుకోసం బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నానని వెల్లడించారు. సీన్ కట్ చేస్తే, రెండు నెలల తరువాత మూడు ఆప్షన్లు జనసేన పార్టీ ముందు ఉన్నాయని క్యాడర్ కు చెప్పుకొచ్చారు. వాటిలో ఒకటి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వెళ్లడం, రెండో ఆప్షన్ జనసేన, టీడీపీ కలిసి వెళ్లడం. మూడో ఆప్షన్ బీజేపీ, జనసేన కలిసి వెళ్లేలా ఈక్వేషన్ చెప్పారు. ఆ సందర్భంగా నాలుగో ఆప్షన్ ఒంటరిగా జనసేన బరిలోకి దిగడాన్ని ప్రత్యర్థులు లేవనెత్తారు. ఒక వేళ అదే జరిగితే, ఇప్పటి వరకు గుర్తింపు లేని జనసేనకు మళ్లీ అదే పరిస్థితి వస్తుందని ఆ పార్టీలోని కొందరి ఆందోళన. అందుకే, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లాలని పవన్ స్కెచ్ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఆప్షన్లన్నీ జనసేనకు క్లోజ్ అవుతూ వస్తున్నాయి. బీజేపీ దాదాపు ఆ పార్టీని దూరంగా పెట్టింది. ఇటీవల పవన్ కల్యాణ్ ను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. పైగా ఏదో ఒక రకంగా అవమానిస్తోంది. దీంతో ఢిల్లీ వైపు చూడడానికి కూడా పవన్ కు అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కమలనాథుల గడపతొక్కారు. మోడీ, అమిత్ షా కు ఆయన దగ్గరవుతున్నారు. అంటే, బీజేపీ, టీడీపీ కలిసి వెళ్లడానికి సిద్ధం అవుతున్నాయన్నమాట. ఫలితంగా జనసేన ఒంటరిగా ప్రస్తుతానికి కనిపిస్తోంది. నాలుగో ఆప్షన్ మినహా ఆ పార్టీకి ఇప్పుడు లేదని రాజకీయ వర్గాల్లో నడుస్తోన్న చర్చ.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీకా `అమృత్ మహోత్సవ్ `కు పవన్ కు ఆహ్వానం అందిందని ఆ పార్టీ చెబుతోంది. కానీ ఆయన హాజరు కాలేదట. ప్రధానమంత్రి భీమవరం పర్యటనలో పాల్గొన్నప్పుడు కూడా ఆహ్వానం ఉన్నప్పటికి పవన్ వెళ్లలేదట. కానీ, ఆ సభలో చిరంజీవికి ప్రత్యేకంగా మోడీ ప్రాధాన్యం ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోదావరి గర్జన కార్యక్రమానికి ఒంట్లో నలతగా ఉందని కార్యక్రమాలకు జనసేనాని డుమ్మా కొట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో రెండురోజులపాటు జరిగిని విషయం విదితమే. ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా తదితర నేతలంతా హైదరాబాద్ లో ఉన్నప్పటికీ మిత్రపక్షంగా పవన్ వారిని కలిసే ప్రయత్నం చేయలేదు. వాళ్లు కూడా పవన్ ను గుర్తించుకోలేదట. కేంద్ర పెద్దలు జనసేనానిని దూరంగా పెట్టారా? లేదంటే పవన్‌కల్యాణే ఢిల్లీ పెద్దలను వద్దనుకుంటున్నారా? అనే విషయం అస్పష్టం. దీని వెనుక ఉన్న కారణాలపై జనసేనలో చర్చ జరుగుతోంది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తర్వాత పవన్ సత్తా ఏమిటో బీజేపీకి తెలిసిపోయింది. ఆ రోజు నుంచి బీజేపీ లైట్ గా ఆయన్ను తీసుకుంటోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు చేరోదారిని ఎంచుకున్నాయి. వాస్తవానికి అమరావతి రాజధానిగా ఉండాలనే నినాదంతో బీజేపీతో కలిసి రాజధాని పరిధిలో పాదయాత్ర చేయాలని పవన్ అనుకున్నారని టాక్. కానీ ఆయనకు ఆహ్వానం కూడా లేకుండా బీజేపీ సొంతంగా అమరావతి పాదయాత్ర నిర్వహించింది. ఇలా బీజేపీ, జనసేన మధ్య పెరిగిన గ్యాప్ తెలుగుదేశం కూడా ఇబ్బందిగానే ఉంది. కేంద్రంలోని బీజేపీతో మాత్రమే కలిసి వెళ్లాలని టీడీపీ భావిస్తోంది. దీంతో ఒంటరైన జనసేన రాబోవు రోజుల్లో కొందరిని ఓడించడానికి మాత్రమే పరిమితం అవుతుందా? లేక గుర్తింపు తెచ్చుకుంటుందా? అనేది చూడాలి.