Paddy Bags Missing: ఐకేపీ సెంటర్ వద్ద వడ్ల బస్తాలు మాయం..బోరునవిలపించిన రైతు..!!
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని ఐకేపీ సెంటర్ వద్ద కాంటా వేసిన వడ్ల బస్తాలు మాయమయ్యాయి.
- By Hashtag U Published Date - 11:53 AM, Sun - 22 May 22
జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని ఐకేపీ సెంటర్ వద్ద కాంటా వేసిన వడ్ల బస్తాలు మాయమయ్యాయి. మండలంలోని బొంతగుట్ట నాగారంలో ఈ ఘటన జరిగింది. రైతు ఈరుమల్ల జంపులు తెలిపిన ప్రకారం…తనకున్న రెండు ఎకరాల పొలంలో178 బస్తాల ధాన్యాన్ని తీసుకువచ్చి ఐకేపీ సెంటర్ వద్ద ఆరబోశాడు. నిన్న శనివారం నాడు కాంటా నిర్వహించారు. లారీలు అందుబాటులో లేకపోవడంతో బస్తాలు మొత్తం కూడా ఐకేపీ సెంటర్ వద్దే నిల్వ చేశాడు.
ఆదివారం ఉదయం రైతు బస్తాల దగ్గరకు వెళ్లగా…54 బస్తాలు కనిపించలేదు. దీంతో కంగుతున్న రైతు…తన ధాన్యం దొంగలించారని బోరున విలపించాడు. సకాలంలో కాంట వేసిన వడ్ల బస్తాలు తరలించడంతో అధికారులు నిర్లక్ష్యం వహించారని…సకాలంలో తరలిస్తే తనకు ఇలా జరిగేది కాదని బోరుమన్నాడు దీనికి పూర్తి బాధ్యత అధికారులు, ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశాడు.