TMC MLA: ఒక భార్యను ఐదుగురు పంచుకోవచ్చు.. టీఎంసీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయ నేతలు పాపులారిటీ కోసం లేదంటే వివాదం కోసం కొన్నిసార్లు విషయం తెలియకుండానే మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.
- By Anshu Published Date - 10:02 PM, Wed - 1 February 23

TMC MLA: రాజకీయ నేతలు పాపులారిటీ కోసం లేదంటే వివాదం కోసం కొన్నిసార్లు విషయం తెలియకుండానే మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే ఒకతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక భార్యను ఐదుగురు పంచుకోవచ్చని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారానికి కారణమైంది. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెర లేచింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్ లో మధ్యాహ్న భోజనం పథకం ఎలా అమలవుతోందని కేంద్ర విద్యాశాఖ బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో మధ్యాహ్న భోజనం పథకం అమలులో అవకతవకలు జరిగినట్లు తేలగా.. ఐదుగురు వంట సిబ్బందికి కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏడుగురికి సమానంగా ఇస్తోందని తేలింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా దీనిపై స్పందిస్తూ..‘భారత సంస్కృతిలో ఐదుగురు కలిసి ఒకే భార్యను పంచుకుంటారు’ అని అన్నారు. దీంతో దుమారం రేగింది. టీఎంసీ పార్టీకి చెందిన నేతలకు మహిళలు అంటే ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీఎంసీ నాయకులు అందుకే అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే, నటి అగ్నిమిత్ర పాల్ ధ్వజమెత్తారు.
కాగా గతంలో కూడా మదన్ మిత్రా ఇలాంటి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. తన నోటి దూల ద్వారా వార్తల్లో నిలుస్తున్న మదన్ మిత్రా వ్యవహారం మీద సొంత పార్టీ టీఎంసీ సైతం గుర్రుగా ఉంది. మదన్ మిత్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని టీఎంసీ ప్రకటించింది. మొత్తానికి మదన్ మిత్రా వ్యవహారం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారానికి కారణమైంది.