Ukraine: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య మాస్టర్ ప్లాన్.. ప్రపంచ దేశాధినేతల భార్యలతో….!
ఉక్రెయిన్ పై ముప్పేట దాడిని చేస్తోంది రష్యా. ప్రపంచ దేశాలు వద్దని చెబుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అస్సలు వినడం లేదు. మరోవైపు సమరంలో వేలాది మంది సైనికులు, అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
- By Hashtag U Published Date - 04:09 PM, Sun - 6 March 22

ఉక్రెయిన్ పై ముప్పేట దాడిని చేస్తోంది రష్యా. ప్రపంచ దేశాలు వద్దని చెబుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అస్సలు వినడం లేదు. మరోవైపు సమరంలో వేలాది మంది సైనికులు, అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య.. వొలెనా జెలెన్ స్కీ ఓ మాస్టర్ ప్లాన్ ను తయారుచేశారు. యుద్ధంలో మహిళా సెంటిమెంట్ ను దండిగా జొప్పించారు. అది.. అమెరికా నుంచి రష్యా వరకు అన్ని దేశాల్లో మహిళలను కదిలిస్తోంది.
ఉక్రెయిన్ పై రష్యా చేపట్టింది కేవలం సైనిక చర్యే అని ఆ దేశం సమర్థించుకుంటున్నా ఇతర దేశాలకు అది యుద్ధమని తెలుసు. అందుకే అదే విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని ఇతర దేశాల ఫస్ట్ లేడీలను వోలెనా జెలెన్ స్కీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోరారు. ఆ పోస్ట్ భావోద్వేగంగా ఉండడంతో అందరినీ కదిలిస్తోంది.
రష్యా చెబుతున్నట్టు ఇది సైనిక చర్య కాదని.. ఆ దేశ సైనికులు సైనిక విన్యాసాల్లో పాల్గోవడం లేదన్నారు వొలెనా జెలెన్ స్కీ. వారంతా ఉక్రెయిన్ తో పోరాటంలో మరణిస్తున్నారని.. ఆ విషయం రష్యా సైనికుల తల్లులకూ చేరేలా చర్యలు తీసుకోండంటూ వోలెనా ఆవేదనతో చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పుతిన్ అణుదాడి బెదిరింపులను ప్రస్తావిస్తూ.. అది ఉక్రెయిన్ కో, యూరప్ కో పరిమితం కాదని.. మీపైనా దాడి చేస్తుందని.. ఆ విషయం వారికి చెప్పండన్నారు.
నిజంగానే అణుదాడి అంటూ జరిగితే.. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం అంటూ ఏదీ ఉండదన్న వొలెన్ మాటల గురించి ఆలోచించాల్సిందే. ఇంత ఆవేదనలోనూ ఆమె ధైర్యం కోల్పోలేదు. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది అని చెబుతూనే.. తనను తాను రక్షించుకుంటుందన్నారు. యుద్ధం గురించి, దాని పర్యవసానాల గురించి స్వయంగా ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ వొలెనా ప్రస్తావించేసరికీ ఆమె మాటలు అందరినీ ఆవేదనకు గురిచేస్తున్నాయి.