Jana Sena: ‘తెలంగాణ జనసేన’ నేతలతో ‘నాదెండ్ల మనోహర్’ కీలక సమావేశం!
తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి..
- By Hashtag U Published Date - 07:29 PM, Sun - 27 February 22

తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి.. అప్పుడు కచ్చితంగా మన పార్టీ ప్రభావం రాజకీయంగా కనిపిస్తుంది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో అటువంటి బలమైన క్రియాశీలక సభ్యులతో బృందం ఉంటే పోటీ చేసిన అభ్యర్థికి ఉండే ధైర్యం వేరన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వారంతా మనకోసం నిలబడడానికి వస్తారు అన్న నమ్మకం ఉంటేనే పోరాటం చేయగలుగుతామన్నారు.
ఆదివారం ఉదయం తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంపై హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు రామ్ తాళ్ళూరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యులు మన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ అండగా నిలిచి భరోసా ఇచ్చేందుకే పవన్ కల్యాణ్ గ బీమా సదుపాయాన్ని తీసుకువచ్చారు. దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు రూ. 5 లక్షల రూపాయిలు ఇచ్చి ఆ సభ్యుడి కుటుంబానికి ఏ విధంగా భరోసా ఇవ్వగలిగామో అంతా చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 38 మందికి పవన్ కళ్యాణ్ తరఫున స్వయంగా వెళ్లి ఆ మొత్తాన్ని అందించాం.
జిల్లా నాయకత్వం మొత్తం కలసి ఇంటికి వెళ్లి ఆ భరోసా నింపినప్పుడు ఆపదలో అండగా నిలిచామన్న ధైర్యం వారిలో కలిగింది. చెక్కులు ఇచ్చిన వారిలో 36 చిన్న చిన్న కుటుంబాలే. రోజువారీ పనులు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చినవారే.