MP Arvind: హోంమంత్రి పదవికి మహమ్మద్ అలీ రాజీనామా చేయాలి : ఎంపీ అర్వింద్
- By Balu J Published Date - 03:43 PM, Sat - 7 October 23

MP Arvind: తెలంగాణ హోంమినిస్టర్ గన్ మెన్ ను చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా హోం మంత్రి మహమ్మద్ అలీ తన భద్రత సిబ్బంది పై చేయి చేసుకున్న ఘటన పై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అధికార అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. రక్షణ కల్పించే భద్రత సిబ్బంది పై హోంమంత్రి మహమ్మద్ అలీ చేయి చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. మహమ్మద్ అలీ భద్రత సిబ్బంది పై చేయి చేసుకుంటున్న వీడియోను చూపిస్తూ.. అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ స్పందించాలన్నారు.అధికార అహంతో తన సొంతభద్రత సిబ్బంది చెంపపై కొట్టిన మహమ్మద్ అలీ పై తక్షణమే డీజీపీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సంఘటన అత్యంత సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.కాగా అటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం,శ్రేణులు సైతం ఈ ఘటనపై సామాజిక మాద్యమాల్లో స్పందిస్తూ హోమ్ మినిస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.