Inmates Facilities: ఖైదీలకు పానీపూరీ, ఐస్ క్రీమ్.. 173 రకాల ఆహారాలు, సౌకర్యాలు.. ఎక్కడో, ఎందుకో చూడండి
చాట్ మసాలా, పచ్చళ్లు, కొబ్బరినీళ్లు, చెస్ బోర్డులు, ఓట్ మీల్, కాఫీ, చిక్ పీ, ఫడ్జ్, షుగర్ లెస్ స్వీట్స్, ఐస్ క్రీమ్, ఆర్గానిక్ ఫ్రూట్స్, వేరుశెనగలు, పానీపూరీ మొదలైనవి
- Author : News Desk
Date : 12-12-2023 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
Inmates Facilities: జైళ్లలో ఉండే ఖైదీలకు ఎలాంటి ఆహారం పెడతారో, ఎలాంటి శిక్షలు విధిస్తారో, ఖైదీలతో ఎలాంటి పనులు చేయిస్తారో.. చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నిజజీవితంలో జైల్లో ఉండే ఖైదీలను కూడా అలాగే చూస్తారా ? వారి కనీస అవసరాలను తీర్చుకునే వీలుంటుందా ? నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తారా? అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఈ ప్రశ్నలకు మహారాష్ట్ర జైళ్లశాఖ సరైన సమాధానం చెబుతోంది. మీరు చదివేది నిజమే. ఇక్కడ ఖైదీలకు పానీపూరి, ఐస్ క్రీమ్, మిఠాయిలు సహా 173 రకాల ఆహారాలను, ప్రాథమిక సౌకర్యాల జాబితాను జైలు యంత్రాంగం సిద్ధం చేసింది.
చాట్ మసాలా, పచ్చళ్లు, కొబ్బరినీళ్లు, చెస్ బోర్డులు, ఓట్ మీల్, కాఫీ, చిక్ పీ, ఫడ్జ్, షుగర్ లెస్ స్వీట్స్, ఐస్ క్రీమ్, ఆర్గానిక్ ఫ్రూట్స్, వేరుశెనగలు, పానీపూరీ మొదలైనవి జైలు మెనూలో ఉన్నాయి. అలాగే దుస్తులు, స్కిన్ కేర్ ఉత్పత్తులతో పాటు ఫేస్ వాష్, హెయిర్ కలర్, టీ షర్ట్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సిగరెట్ల అలవాటును తగ్గించేందుకు నికోటిన్ పీఆర్టీ మాత్రలు కూడా ఉంచారు. ఖైదీలు చదివేందుకు వివిధ రకాల ఆర్ట్ పుస్తకాలను కూడా అందించాలని నిర్ణయించారు. ఖైదీలకు కల్పిస్తున్న జైలు సౌకర్యాల్లో ఎందుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారో ఏడీజీపీ అమితాబ్ గుప్తా మీడియాకు వివరించారు.
జైలులో పెట్టే ఆంక్షలు చాలామంది ఖైదీల ఆలోచనా విధానాన్ని మారుస్తాయని, ఆ ఆంక్షలు వారిలో మంచి మార్పు తీసుకొచ్చేలా ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరిస్థితుల కారణంగా తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల జీవితం ఎంతో ఒత్తిడిగా ఉంటుందన్నారు. 4 గోడల మధ్యన ఉండే వారికి మంచి ఆహారం, నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఖైదీల గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర జైలు శాఖ అధికారులు.. ఇతర రాష్ట్రాల జైలు అధికారులకు ఆదర్శంగా నిలిచారు.