World Food Day : ఆహార కొరతను జయిద్దాం.. ఆకలి చావులు ఆపేద్దాం
World Food Day : ఇవాళ (అక్టోబరు 16) ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచం ఆకలిని తీర్చడమే ‘వరల్డ్ ఫుడ్ డే’ ప్రధాన లక్ష్యం.
- By Pasha Published Date - 11:07 AM, Mon - 16 October 23

World Food Day : ఇవాళ (అక్టోబరు 16) ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచం ఆకలిని తీర్చడమే ‘వరల్డ్ ఫుడ్ డే’ ప్రధాన లక్ష్యం. ఆహారాన్ని పొదుపు చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని ప్రోత్సహించడం అనేవి ఇతర ముఖ్య లక్ష్యాలు. బాలల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేలా ప్రజలను చైతన్యపర్చడం కూడా దీని కీలక ఎజెండా. ‘‘నీరే జీవితం.. నీరే ఆహారం.. అందరికీ అది దక్కాల్సిందే’’ అనేది 2023 సంవత్సరపు ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ థీమ్. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) 1945 సంవత్సరంలో ఏర్పాటైంది. అయితే 1979 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆహారం విలువను ప్రజలకు తెలియజేయాలని హంగరీ దేశ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ పాల్ రోమానీ చేసిన సూచన మేరకు ఆహార దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పేదరికం కారణంగా ప్రపంచంలో ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో 60శాతం మంది మహిళలే ఉండటం ఆందోళన కలిగించే అంశం. దీని పర్యవసానంగా ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. వీరిలో 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే జన్మిస్తున్నారు. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే..ఆకలి వల్ల జరిగే మరణాలే ఎక్కువగా ఉన్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ మరణాల స్థాయి ఎంతగా ఉందంటే.. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలు సహా మొత్తం 25,000 మంది ఆకలి సంబంధిత కారణాలతో ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారు. ఓ వైపు పేద ఆఫ్రికా దేశాలలో ఆకలి చావులు జరుగుతున్నా.. మరోవైపు ప్రపంచ జనాభా పెరుగుతోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 960 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తని పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉంది.
Also Read: Boy – 26 Times Stabbed : బాలుడికి 26 కత్తిపోట్లు.. 71 ఏళ్ల వృద్ధుడి ఎటాక్.. ఎందుకంటే ?
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారత్ లోనే ఎక్కువగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే ప్రతీ ఒక్కరు ఆహారాన్ని వ్యర్థం చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరంతో పాటు వ్యవసాయానికి అవసరమైన వనరుల్ని (World Food Day) కాపాడుకోవాలి. భావితరాలకు వాటిని అందించాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత.