Tanikella Bharani: రైల్వేతో నాకున్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిది: తనికెళ్ల భరణి
మా నాన్న గారు రైల్వే ఉద్యోగి కావడంతో ఇండియా మొత్తాన్ని మూడుసార్లు తిరిగాను.
- By Balu J Published Date - 04:50 PM, Sat - 1 April 23

ఇప్పటివరకు ప్లాట్ ఫామ్ టికెట్ కొనకుండా ఏ రైల్వే స్టేషన్లోనూ ప్లాట్ ఫామ్ ఎక్కలేదు. మా నాన్న గారు రైల్వే ఉద్యోగి కావడంతో ఇండియా మొత్తాన్ని మూడుసార్లు తిరిగాను. అప్పట్లో మేము చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లోని 221/1లో నివాసం ఉన్నాము.ఆ ఇంటి పేరుతో ఓ సినిమా తీయాలనే కోరిక ఇప్పటికీ ఉంది. రైల్వే కాలనీలు, మినీ ఇండియాను తలపించేవి.దేశంలోని అన్ని ప్రాంతాల వారు అక్కడే ఉన్నందున అన్ని పండుగలను ఘనంగా నిర్వహించుకునేవాళ్లము. విమానంలో సౌకర్యాలున్నా రైలు ప్రయాణం అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. యూరప్ లో రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు” అని ప్రముఖ నటుడు, సినీ రచయిత తనికెళ్ల భరణి చెప్పారు.
శుక్రవారం రాత్రి దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి ఆధ్వర్యంలో సికిం ద్రాబాద్ రైల్ నిలయం ఆడిటోరియంలో ఉగాది పురస్కార0తో ఆయనను సత్కరించారు. ఆత్మీయ అతిథిగా హాజరైన సినీ మాటల రచయిత డాక్టర్ బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ తన గురువైన తనికెళ్ల భరణికి రైల్వే తరుఫున సత్కారం జరగడం, మంచి మనసున్న మనిషికి జరుగుతున్న సత్కారంగా అభివర్ణించారు. కార్యక్రమంలో లలితకళా సమితి అధ్యక్షురాలు కె.పద్మజ, ఉపాధ్యక్షులు రవి పాడి , సంయుక్త కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా, ఆకెళ్ళ శివప్రసాద్, భుజంగరావు, శ్రీకంఠ హన్మంతరావు, రాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.