Rasgulla: రసగుల్లా వల్ల రద్దైన రైళ్లు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!
- By Anshu Published Date - 01:30 PM, Sun - 5 June 22

రసగుల్ల ఈ స్వీట్ ఐటమ్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రసగుల్ల ఏకంగా 12 రైలును రద్దు చేయించింది. అంతే కాకుండా వందకు పైగా రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. రసగుల్లా ఏంటి రైళ్లను దారి మళ్ళించడం ఏంటి అని అనుకుంటున్నారా.. అసలు విషయం లోకి వెళ్దాం.
లఖిసరాయ్‌లోని బరాహియా రైల్వే స్టేషన్‌లో పది రైళ్లను ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానికులు దాదాపు 40 గంటలపాటు నిరసన చేపట్టారు. ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టెంట్‌లు వేసి, రైళ్ల రాకపోకలను 40 గంటలపాటు నిలిపివేశారు. ఈ కారణంగా రైల్వే అధికారులు హౌరా ఢిల్లీ రైలు మార్గంలో 12 రైళ్లను 24 రద్దు చేయవలసి వచ్చింది. వందకి పైగా రైళ్లను దారి మళ్లించారు. నిజానికి నిరసనకారులు బరాహియాలో స్టేషన్‌లో రైళ్లు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
లఖిసరాయ్‌లో తయారు అయ్యే రసగుల్లా కు ఎంతో ప్రసిద్ధి ఉంది. అక్కడ దాదాపుగా రెండు వందలకు పైగా దుకాణాలు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అంతేకాకుండా రోజు టన్నులకొద్దీ రసగుల్లాలను సిద్ధం చేస్తూ ఉంటారు. కానీ ఆ రసగుల్లాలను ఇతర రాష్ట్రాలకు పంపడానికి సరైన సదుపాయం లేదు. లఖిసరాయ్‌లో రైలు ఆగేందుకు స్టాప్ లేకపోవడంతో,రసగుల్లా స్వీట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలోని పలు ప్రాంతాలకు నిల్వలు సరఫరా చేయలేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదే విషయంపై వ్యాపారవేత్త రంజన్ శర్మ అనే వ్యక్తి మాట్లాడుతూ.. రోడ్డు మార్గంలో రసగుల్లాలను రవాణా చేయడం వల్ల అధికంగా ఖర్చు అవుతున్నాయని, తీవ్ర నష్టాలు కూడా వస్తున్నాయని రైల్వే అధికారులకు సూచించడంతో రైల్వే అధికారులు ఈ విషయంపై స్పందించి నెలరోజుల్లోగా ఒక ఎక్స్ ప్రెస్ రైలు బరాహియా స్టేషన్ లో ఆగేలా చూస్తామని, అలాగే ఇతర రైలు కూడా అక్కడ ఆగేలా మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వ్యాపారులు నిరసనను ఆపేశారు.