Grain Purchases : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – ఉత్తమ్ కుమార్
Grain Purchases : సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
- By Sudheer Published Date - 01:09 PM, Tue - 11 November 25
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ఇప్పటివరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు మాత్రమే జరగగా, ఈ ఏడాది రెండింతలు పెరగడం రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చొరవకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక కొనుగోలు రికార్డుగా నిలిచిందని ఉత్తమ్ గర్వంగా చెప్పారు.
IND vs SA: నవంబర్ 14 నుంచి భారత్- సౌతాఫ్రికా తొలి టెస్ట్.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం?!
సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్లు, సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, రైతుల నుంచి 3.95 లక్షల టన్నుల సన్నాలు, 4.59 లక్షల టన్నుల పెద్ద ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గత ఏడాది 55,493 మంది రైతులు ధాన్యం విక్రయించగా, ఈసారి వారి సంఖ్య 1,21,960 మందికి పెరిగిందని తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోలు విలువ రూ.2,041.44 కోట్లు కాగా, ఇది గత సంవత్సరం రూ.915.05 కోట్లతో పోలిస్తే రెట్టింపు అని చెప్పారు. అలాగే సన్నాల బోనస్ రూ.43.02 కోట్ల నుండి ఈసారి రూ.197.73 కోట్లకు పెరిగిందని, అందులో రూ.35.72 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వలు మరియు రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాబోయే రోజులలో వర్ష సూచనలున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ధాన్యం, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు నష్టపోకుండా హై అలర్ట్ లో ఉండాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను రోజువారీగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొత్తం మీద, ఈ సీజన్‌లో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి.