Harish Rao: గవర్నర్ గారు..ఇదేం పద్దతి? : మంత్రి హరీశ్ రావు
బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా..? అని హరీశ్ రావు సూటీగా ప్రశ్నించారు.
- By Balu J Published Date - 11:21 AM, Tue - 26 September 23

దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయించడం దారుణం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని ఆయన తప్పు పడుతూ మండిపడ్డారు. ‘‘అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారు. వారు తమతమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అలాంటివారిని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే.. గవర్నర్ వారిద్దరు బీఆర్‌ఎస్ పార్టీలో సభ్యులుగా ఉండడం వల్ల అనర్హులనడం దారుణమని, ఒకవేళ ఇదే అయితే.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై గారు తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు..? పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్‌గా ఇవ్వవచ్చా..? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
‘‘సర్కారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవిలో తమిళిసై ఉండవద్దు.. మరి ఆమె ఎలా ఉన్నారు.? అంతెందుకు. బీజేపీ పార్టీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా..? బీజేపీ నేత మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్‌సింగ్, రాంషఖల్, రాకేశ్ సిన్హా.. ఇలా వీళ్లంతా బీజేపీలో పనిచేయలేదా..? వీరిని ఎలా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులగా నియమించారు..? బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా.. హన్స్‌రాజ్ విశ్వకర్మ.. ఇలా అనేక మందిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. వీరంతా బీజేపీ పార్టీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా..? అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా..? అని హరీశ్ రావు సూటీగా ప్రశ్నించారు.
‘‘కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి.. బీజేపీయేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా..? తెలంగాణ విషయంలో గవర్నర్ వైఖరిలో మార్పు లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేస్తే ఏమో అనుకోవచ్చు.. కానీ, నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులను ఆపారు. రెండేసిసార్లు బిల్లులను పంపినా వాటిని ఆమోదించలేదు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణం. తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారు’’ హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.