Gaddar Funeral : గద్దర్ ఇక సెలవు..
బౌద్ధ మాత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలను పూర్తి
- By Sudheer Published Date - 08:35 PM, Mon - 7 August 23

అల్వాల్ మహాబోధి స్కూల్ గ్రౌండ్స్ లో బౌద్ధ మాత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలను (Gaddar Funeral) పూర్తి చేసారు కుటుంబ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో గద్దర్ కు తుది వీడ్కోలు పలికారు. గద్దర్ ను కడసారి చూసేందుకు జనం పోటెత్తారు. జోహార్ గద్దర్ అంటూ నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది.
గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న గద్దర్ (Gaddar) ..హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేసారు. అంత బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో ఆయన ఆరోగ్యం విషమించడం తో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గద్దర్ మరణ వార్త యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో పడేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం సాయంత్రం LB స్టేడియం (LB Stadium) కు గద్దర్ పార్థివదేహాన్ని తరలించారు. సోమవారం మధ్యాహ్నం వరకు LB స్టేడియం లోనే పార్థివదేహాన్ని ఉంచారు. గద్దర్ కడసారి చూపు కోసం వేలాదిమంది అభిమానులు , సినీ, రాజకీయ ప్రముఖులు , విప్లవకారులు , ఉద్యమకారులు పోటెత్తారు.
సోమవారం మధ్యాహ్నం గద్దర్ (Gaddar) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో వందలాదిమంది పాల్గొన్నారు. దాదాపు ఆరు గంటలపాటు ఈ యాత్ర సాగింది. అల్వాల్ లోని గద్దర్ ఇంట్లో సీఎం కేసీఆర్ నివాళ్లు అర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మహాబోధి స్కూల్ గ్రౌండ్స్ కు గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ బౌద్ధ మాత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలను పూర్తి చేసారు కుటుంబ సభ్యులు. గద్దర్ అంత్యక్రియ కార్యక్రమంలో రాజకీయ నేతలు , కళాకారులు పాల్గొన్నారు. జోహార్ గద్దర్ అంటూ తుది వీడ్కోలు పలికారు.
ఇక ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్ర (Gaddar Final Journey )లో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర స్కూల్ ఆవరణకు చేరుకుంది. అయితే.. చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also : Zaheeruddin Ali Khan : గద్దర్ అంతిమయాత్రలో విషాదం .. సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ మృతి