Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత.. గుంటూరు జీజీహెచ్ కి తరలింపు..
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
- By Kode Mohan Sai Published Date - 01:04 PM, Mon - 26 May 25
Vallabhaneni Vamsi: వైకాపా నేత, మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం అధికారులు ఆయనను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) కు తరలించారు. అంతకు ముందు కంకిపాడులోని ఆసుపత్రిలో వంశీకి ప్రాథమిక చికిత్స అందించారు.
వంశీని జీజీహెచ్‌కి తీసుకువచ్చిన సమయంలో పోలీసులు ఆసుపత్రి వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ప్రధాన గేటును తాత్కాలికంగా మూసివేయడం వల్ల సాధారణ రోగులు మరియు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ఆసుపత్రిలోకి రావాలంటే రైల్వే స్టేషన్ వైపున ఉన్న ద్వారం మార్గం ఉపయోగించాల్సిందిగా పోలీసులు సూచించారు.
దీంతో, ముఖ్యంగా వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారు ఆ మార్గం ఉపయోగించడంలో తీవ్ర అసౌకర్యం అనుభవించారు. పోలీసులు వేసిన ఆంక్షలు, హడావిడితో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు రోగులు మరియు వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరికి చికిత్స అందించడానికి తీసుకున్న చర్యల వల్ల మిగిలినవారికి అసౌకర్యం కలగడంపై వారు అసంతృప్తి తెలిపారు.