Giorgia Meloni: ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం..!
ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం చేశారు.
- By Gopichand Published Date - 03:41 PM, Sat - 22 October 22

ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోని ప్రమాణ స్వీకారం చేశారు. మెలోని అధ్యక్ష భవనంలో ఇటాలియన్ అధ్యక్షుడి ముందు ప్రమాణ స్వీకారం చేశారు. మితవాద నేతగా పేరున్న 45 ఏండ్ల జార్జియా మెలోని ప్రధాని పీఠం అధిష్టించిన తొలి మహిళగా ఇటలీలో రికార్డులకెక్కారు. జార్జియా మెలోనీతోపాటు ఆమె క్యాబినెట్ కూడా ప్రమాణం చేసింది. దీంతో ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. నాలుగేండ్ల క్రితం కేవలం 4.13 శాతం ఓట్లు పొందిన మెలోని పార్టీకి.. ఈ సారి పోలింగ్ లో 26శాతం ఓట్లు లభించడం విశేషం.
గత నెలలో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆమె పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అత్యధిక ఓట్లను సంపాదించింది. శుక్రవారం సాయంత్రం మెలోని తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఒక మితవాద నేత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. జార్జియా మెలోని 1977, జనవరి 15వ తేదీన జన్మించారు. జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆమె రాజకీయవేత్తగా ఎదిగారు. మెలోని 21 ఏళ్ల వయసులో తొలి ఎన్నికల్లో విజయం సాధించి అధికారికంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బెర్లుస్కోని ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పనిచేశారు. 2012లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీని స్థాపించింది మెలోని.