Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా...
- Author : Prasad
Date : 26-09-2022 - 11:41 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై స్వర్ణ కవచలంకృతంలో కొలువైన దుర్గామాతను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. గవర్నర్‌కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, ఆలయ ఈవీ భ్రమరాంబ స్వాగతం పలికారు. దర్శనానంతరం దసరా నవరాత్రుల తొలిరోజు కనకదుర్గామాతను దర్శించుకోవడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. చెడుపై మంచి విజయం సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించగా, తొలిరోజు దుర్గామాత దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు.