LSG: లక్నో హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్‌లో కొత్త టీమ్ లక్నో సూపర్‌జెయింట్స్ జోరు కొనసాగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో తడబడినప్పటకీ..
- Author : Naresh Kumar
Date : 08-04-2022 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ 15వ సీజన్‌లో కొత్త టీమ్ లక్నో సూపర్‌జెయింట్స్ జోరు కొనసాగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో తడబడినప్పటకీ… ఇప్పుడు హ్యాట్రిక్ విక్టరీ అందుకుంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్ పృథ్వీ షా మెరుపు ఆరంభాన్నిచ్చాడు. లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పృథ్వీ షా కేవలం 7.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించాడు. ఈ పార్టనర్‌షిప్‌లో షా 61 పరుగులు చేయడం విశేషం. అయితే పృథ్వీ షా ఔటైన తర్వాత ఢిల్లీ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు శ్రమించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న డేవిడ్ వార్నర్ నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులకే ఔటవగా…మరో బ్యాటర్ పావెల్ 3 రన్స్‌కే వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ రిషబ్ పంత్, సర్ఫ్‌రాజ్‌ఖాన్ ఆదుకున్నారు. వీరిద్దరూ కాస్త దూకుడుగా ఆడడంతో స్కోర్ 140 దాటగలిగింది. వికెట్లు చేతిలో ఉన్నా ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోవడం ఆశ్చర్యపరిచింది. పంత్ 39 , సర్ఫ్‌రాజ్ 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ , గౌతమ్ 1 వికెట్ పడగొట్టారు.
150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఓపెనర్లు రాహుల్, క్వింటన్ డికాక్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 73 పరుగులు జోడించారు. రాహుల్ 24 రన్స్‌కు ఔటవగా.. డికాక్ మాత్రం దూకుడుగా ఆడాడు. అయితే ఎవిన్ లూయీస్ , దీపక్ హుడా నిరాశపరచడం, డికాక్ 80 పరుగులు చేసి ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివర్లో మూడు ఓవర్లు ఢిల్లీ కట్టిదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో కృనాల్ పాండ్యా , ఆయూశ్ బదౌనీ లక్నో విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇది వరుసగా మూడో విజయం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో ఓటమి. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజర్ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 26 పరుగులే ఇచ్చాడు. అంచనాలు పెట్టుకున్న నోర్జే మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి ఓవర్లనో 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2 , లలిత్ యాదవ్, శార్థూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే తాజా విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో రెండో స్థానానికి దూసుకొచ్చింది.
After a kadak two innings, #LSGvsDC comes to an end. Kaisa laga humaara भौकाल? ✅#AbApniBaariHai💪#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 @My11Circle pic.twitter.com/8NDsqcfvbr
— Lucknow Super Giants (@LucknowIPL) April 7, 2022