R-Day: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గణతంత్ర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం అన్నారు.
- By Hashtag U Published Date - 11:12 PM, Tue - 25 January 22

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారత దేశ ప్రధాన లక్షణమని సిఎం అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని సిఎం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం’.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పధానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు.
పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు.
ఇది దేశ ప్రజల రాజనీతి దార్శనికతకు నిదర్శనంగా నిలిచిందని సిఎం అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను మరింతగా పటిష్టపరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను పొందుపరిచారని సిఎం అన్నారు. మన దేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు ప్రతిబింబాలుగా నిలిచాయని సిఎం అన్నారు. ‘ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ గా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో వెలుగొందుతున్న రాష్ట్రాల హక్కులు మరింతగా సంరక్షించబడడంతోనే భారత ప్రజాస్వామ్య ఖ్యాతి దశ దిశలా ఫరిడవిల్లుతుందని సిఎం అన్నారు.
భారత దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం, రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్పూర్తిని ప్రారంభం నుంచీ ప్రదర్శిస్తున్నదన్నారు. రాజకీయాలను, పరిపాలనను మిళితం చేయకుండా తెలంగాణ రాష్ట్రం నెరపుతున్న రాజ్యాంగబద్దమైన రాజనీతి’ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు అందించిన ఫెడరల్ స్పూర్తిని మరింత ధృఢంగా కొనసాగించడానికి కంకణబద్ధులమై ఉందామని, అందుకు అచంచల విశ్వాసంతో ప్రతినబూనుదామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Cover pic- File Photo