AP Scheme: పేదల కోసం మరో పథకం.. నేడు తణుకులో ప్రారంభం
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మరో పథకాన్ని పేద ప్రజలకు అందించనున్నారు.
- By Hashtag U Published Date - 09:17 AM, Tue - 21 December 21

సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మరో పథకాన్ని పేద ప్రజలకు అందించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించి.. ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా 1,03,620 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు తణుకులో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పర్యవేక్షించారు.
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జగనన్న ‘సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్)’ తీసుకొచ్చింది. అయితే.. ఈ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం నగదు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేదలు ఎవరూ ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగానే ఇంటి పట్టాలు అందజేస్తామంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు.