YSR Matsyakara Bharosa: 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా?
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొలిటికల్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.
- By Praveen Aluthuru Published Date - 06:22 PM, Tue - 16 May 23

YSR Matsyakara Bharosa: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొలిటికల్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తులపై విమర్శలవర్షం కురిపించారు. ప్రధానిని, రాష్ట్రపతిని చేసిన అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఇక ఆయన దత్తపుత్రుడు పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా.. 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితుల్లో లేడని సీఎం విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ లపై సీఎం జగన్ మాటల తూటాలు పేల్చారు.
రాజకీయంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటుందని, పర్సనల్ గా హైదరాబాద్ మీద ప్రేమ ఉంటుందని, అందుకే చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారని విమర్శించారు. నేను తాడేపల్లిలో ఉంటున్నాని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని సీఎం అన్నారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతుంటారని ఫైర్ అయ్యారు. ఈ పదిహేనేళ్లలో నాపై ఎన్నో కుట్రలు జరిగాయని, అయినా నేను ప్రజల కోసమే నిలబడ్డాను అంటూ వ్యాఖ్యానించారు సీఎం జగన్.
చంద్రబాబు చేతిలో దత్తపుత్రుడి పార్టీ నడుస్తుందని సీఎం విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడిని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్తాడని, చంద్రబాబు సూచనల్ని దత్తపుత్రుడు తూచా తప్పక పాటిస్తాడంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు సీఎం జగన్. ఇక వీళ్లిద్దరికీ తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివీ5 దొంగల ముఠా తోడైందని, ఆ మీడియాలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టు రాస్తారని ఎద్దేవా చేశారు సీఎం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ గెలిపించినట్టు, బీజేపీ ఓడితే తమతో రావాలని కోరుతుందని ఇలాంటి పొలిటికల్ డ్రామాలు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు పోరాటం నా మీద కాదని, ఆంధ్ర ప్రజల మీద అంటూ చురకలంటించారు సీఎం జగన్.
Read More: 71000 Appointment Letters : 71,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్