Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీకి బిగ్ షాక్
Vallabhaneni Vamshi : బెయిల్ కోసం నూజివీడు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది
- By Sudheer Published Date - 05:08 PM, Mon - 26 May 25
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)కి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, బెయిల్ కోసం నూజివీడు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, వంశీకి బెయిల్ మంజూరు చేయడం సరికాదని అభిప్రాయపడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.
Pawan Warning : నిన్న అల్లు అరవింద్ ..నేడు దిల్ రాజు..అసలు లెక్కలు బయటకొస్తున్నాయి
ఇప్పటికే వంశీపై గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి, ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసుల్లో ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పి.టి. వారెంట్ దాఖలుతో ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పటికే మూడు నెలలకుపైగా జైల్లో ఉన్న వంశీ, ఆరోగ్య సమస్యల కారణంగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా, కోర్టు నిర్ణయాలతో వరుసగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ జైలులో వంశీ ఆరోగ్యం కొంతకాలంగా ఆందోళనగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వైద్య కారణాలు చూపుతూ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నా, న్యాయవ్యవస్థ మాత్రం కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. వంశీకి బెయిల్ తిరస్కరణ వల్ల, ఆయనపై ఉన్న ఇతర కేసుల విచారణలోనూ దర్యాప్తు అధికారులు మరింత జోరుగా నడిపే అవకాశం కనిపిస్తోంది.