KCR:వీహెచ్పీ వాళ్ళు.. ఢిల్లీ పోలీసులపై యుద్ధం ప్రకటిస్తారా – కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కేటీఆర్ ప్రశ్నలు
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
- By Hashtag U Published Date - 01:30 PM, Tue - 19 April 22

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జహంగీర్ పురిలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలతో సంబంధం ఉన్న వీహెచ్పీ కార్యకర్తలను ఆ సంస్థ వెనకేసుకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. వీహెచ్పీ కార్యకర్తలపై ఏవైనా చర్యలు తీసుకుంటే .. ఢిల్లీ పోలీసులపై యుద్ధాన్ని ప్రకటిస్తామని వీహెచ్పీ నాయకత్వం హెచ్చరికలు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు. వీహెచ్పీ అనేది.. మన దేశ అత్యున్నత చట్టాల కంటే పెద్దదా ?
చట్టాలకు అతీతమైందా ? అని ప్రశ్నించారు. ‘ ఢిల్లీ పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వీహెచ్పీ ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు ? ‘అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను ఆయన నిలదీశారు. ‘ నేరుగా మీ పరిధిలో పనిచేసే ఢిల్లీ పోలీసులపై వీహెచ్పీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే .. ఎందుకు ఊరుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలోని జహంగీర్ పురిలో వీహెచ్పీ .. పోలీసుల అనుమతులు తీసుకోకుండానే హనుమాన్ శోభాయాత్ర నిర్వహించింది. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు , ఒక వీహెచ్పీ నాయకుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులను టార్గెట్ చేస్తూ పలువురు వీహెచ్పీ నేతలు వ్యాఖ్యలు చేశారు.