AP New Districts: 29న కొత్త జిల్లాల సరిహద్దుల ఫైనల్
కొత్త జిల్లాల కోసం వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదులను అధ్యయనం చేస్తోన్న యంత్రాంగం ఈనెల 29న సరిహద్దులను ఫైనల్ చేయబోతున్నారు.
- By CS Rao Published Date - 11:44 AM, Sat - 26 March 22

కొత్త జిల్లాల కోసం వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదులను అధ్యయనం చేస్తోన్న యంత్రాంగం ఈనెల 29న సరిహద్దులను ఫైనల్ చేయబోతున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసన సభలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాల్లో ఉగాది పండుగ నుంచి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులపై సీఎం నేరుగా అధికారులతో కూలంకషంగా చర్చించారు.
ఎచ్చర్లను శ్రీకాకుళం జిల్లాలోనే ఉంచేందుకు సీఎం అంగీకరించారని గురువారం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే నర్సాపురం కేంద్రంగా జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు సీఎంని కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాలపై తమ విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలకు తుది రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఫైనల్ జాబితాను తయారు చేయడానికి సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.