Inter Boy: చుట్టూ అమ్మాయిలను చూసి పరీక్ష హాల్లో స్పృహతప్పి పడిపోయిన ఇంటర్ అబ్బాయి!
హాల్లోకి వెళ్లిన ఇంటర్ విద్యార్థి.. లోపల ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు.
- Author : Maheswara Rao Nadella
Date : 02-02-2023 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
హాల్లోకి వెళ్లిన ఇంటర్ విద్యార్థి (Inter Boy) లోపల ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. బీహార్‌లోని నలందా జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి (Inter Boy) అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. గణితం పరీక్ష రాసేందుకు నిన్న సుందర్ గఢ్ లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూలుకు వెళ్లాడు. హాల్లోకి వెళ్లగానే లోపల పెద్ద సంఖ్యలో కనిపించిన అమ్మాయిలను చూసి ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడ్డాడు. స్కూలు సిబ్బంది వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆ పరీక్షహాల్లో 500 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి మధ్య శంకర్ ప్రసాద్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయినట్టు ఆయన తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు. విద్యార్థి కిందపడడంతో వెంటనే అప్రమత్తమైన స్కూలు అధికారులు ప్రథమ చికిత్స అనంతరం సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నట్టు ఆయన తండ్రి తెలిపారు.
అమ్మాయిల కోసం కేటాయించిన పరీక్ష హాలులో అబ్బాయికి ఎలా సీటు వేస్తారని విద్యార్థి బంధువులు ప్రశ్నిస్తూ బీహార్ ఇంటర్మీడియెట్ కౌన్సిల్‌పై మండిపడుతున్నారు. 500కు పైగా అమ్మాయిలు ఉన్న పరీక్ష హాలులో తన మేనల్లుడికి సీటు కేటాయించడం ముమ్మాటికి అధికారుల తప్పేనని మనీశ్ మేనత్త ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Madras High Court: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. భర్తకు ముస్లిం మహిళ విడాకులు..